Nizamabad Lok Sabha Fight 2024 : నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటి వరకు 17సార్లు ఎన్నికలు జరిగితే, 14 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కోసారి గెలుపొందాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి సీనియర్ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌లు ప్రచారం చేస్తున్నారు.
ఇందూర్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ, ఆర్మూర్, జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం కోరుట్ల, బాల్గొండ, జగిత్యాలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలవగా, నిజామాబాద్ రూరల్, బోధన్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్‌లలో బీజేపీ నెగ్గింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోరు రసవత్తరంగా మారింది.
నిజామాబాద్ ఓటింగ్ : నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉండగా, అందులో 8,98,647 మంది మహిళలు, 8,06,130 మంది పరుషులు, మరో 90 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 15,53,385 ఓట్లు ఉంటే 10,62,768 ఓట్లు పోలయ్యాయి. 68.24 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు 4,80,584 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి కవితకు 4,09,709 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కికి 69,240 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 4.17 లక్షలు, కాంగ్రెస్‌కు 4.08 లక్షలు, బీజేపీకి 3.65లక్షల ఓట్లు వచ్చాయి.
2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం దేశం దృష్టిని ఆకర్షించింది. పసుపు పంటకు మద్ధతు ధర డిమాండ్ చేస్తూ పసుపు రైతులు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, రైతులతో కలిసి ఏకంగా 185 నిజామాబాద్ నుంచి పోటీ పడ్డారు. ఇప్పుడు నిజామాబాద్ నుంచి 29 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, అర్వింద్‌లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకు ఓట్లు దాదాపుగా సమానంగా రావడంతో విజయంపై ధీమాతో ఉన్నారు.
సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీజేపీ : పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ఘన విజయం సాధించిన గత సీఎం కుమార్తెను ఓడించిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఉదయం ఛాయ్ పే చర్చతో పాటు మధ్యాహ్నం వివిధ వర్గాలతో హాల్ మీటింగ్‌లు, సాయంత్రం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తీసుకువచ్చామని, మళ్లీ గెలిపిస్తే చక్కెర పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ జగిత్యాల సభలో పాల్గొనగా, ఈ నెల 5న నిజామాబాద్‌లో అమిత్ షా ప్రచారం చేయనున్నారు.
పూర్వవైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నం : నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఈ స్థానంలో కాంగ్రెస్ 11 సార్లు విజయం సాధించింది. గత రెండు పర్యాయాలు వరుసగా ఓడిపోగా, ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం, ఆరు గ్యారంటీల అమలు, షుగర్ పరిశ్రమ తెరిపించడంపై వేసిన కమిటీ వంటి అంశాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు సహకరించకపోవడం ప్రతికూలంగా మారుతోందని చెప్పవచ్చు.
కేసీఆర్ అభివృద్ధే గెలిపిస్తుంది : గత ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే సీనియర్ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ను బరిలో నిలిపింది. గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న సమయాల్లో హాల్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే నేతగా, ప్రజా సమస్యలపై మిగతా అభ్యర్థుల కంటే తనకే ఎక్కువ అవగాహన ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. బోధన్ - బీదర్ రైల్వే లైన్, చక్కెర పరిశ్రమ తెరిపించడం, జక్రాన్‌పల్లి విమానాశ్రయ సాధనకు కృషి చేస్తానని ఆయన చెబుతున్నారు.
బాండ్ పేపర్ రాసి మరీ అర్వింద్ మాట తప్పారు : జీవన్‌రెడ్డి
గల్లీ నుంచి దిల్లీ దాక బీజేపీ ఉంటేనే అభివృద్ధి సాధ్యం - అర్వింద్