NDA Candidates Election Campaign Across the State: నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా ఇంటింటి ప్రచారాలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా పలుచోట్ల వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారాల్లో భాగమవుతున్నారు.
Visakha District: విశాఖ జిల్లా భీమునిపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేపలుప్పాడ, మంగమారిపేటలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా కూటమి నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం గెలుపుతో రాష్ట్రంలో ఎన్డీఏ విజయ డంకా మోగిస్తుందని తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడిగా కలమట వెంకటరమణమూర్తి బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబి నాయన ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. బొబ్బిలి పట్టణం, మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి సైకిల్ గుర్తుకి ఓట్లు వేయాలని కోరారు.
Konaseema District: కోనసీమ జిల్లాలో కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. ముమ్మడివరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాథుర్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం తధ్యమని మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. రాయవరం మండలం చెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Anakapalli District: అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సుపర్ సిక్స్ పథకాలను వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత వలస వెళ్లిపోతున్నారన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వగృహంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికలను విజయ తదితరులు ఆవిష్కరించారు. రాష్ట్రంలో వైయస్ జగన్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఇందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
West Godavari District: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఆయన సతీమణి తణుకులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తణుకు నియోజకవర్గంలో అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు.
బీసీలకు జగన్ తీరని ద్రోహం - బ్యాక్‌బోన్ అని కీర్తిస్తూనే వెన్నుపోటు - CM Jagan Cheated BC
NTR District: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. 19వ వార్డుకి చెందిన300 కుటుంబాలు వైసీపీను వీడి తెలుగుదేశంలో చేరాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఆయన సతీమణి అనురాధ, అతని కుమారులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్‌ను, ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని కోరారు. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఓటర్లను అభిమానంగా పలుకరిస్తూ ఓట్లను అభ్యర్దిస్తున్నారు.
Kurnool District: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. నియోజకవర్గంలోని పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలకడ, కంభంవారి పల్లి మండలంలో తన కుటుంబ సభ్యులతో పాటుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు ప్రచార కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని నెల్లూరు జిల్లా కావలి ప్రచారానికి బాలకృష్ణ బయల్దేరారు. ప్రచారానికి వెళ్తున్న బాలకృష్ణకు ఎర్రమంచిలోని హెలిప్యాడ్ వద్ద పెనుకొండ అభ్యర్థి సవిత టీడీపీ శ్రేణులతో కలిసి స్వాగతం పలికారు. మడకశిర నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రచారానికి మహిళలు, కార్యకర్తలు, గ్రామస్థులు తరలివచ్చి స్వాగతం పలికారు.
దివ్యాంగులకు వైసీపీ సర్కార్ ద్రోహం - కనికరం లేకుండా రాయితీలు ఎత్తివేత - Disabled people struggled
పుట్టపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు పూలు జల్లుతూ, హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం పల్లె సింధూర రెడ్డి ఇంటి ఇంటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండంటూ ప్రచారం నిర్వహించారు. నల్లచెరువు మండలం కే.పూలకుంటలో కదిరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ప్రచారం నిర్వహించారు. వెంకట ప్రసాద్ సతీమణి యశోదాదేవి నియోజకవర్గంలోని పలు వార్డులో ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిచారు.
YSR District: వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సెంటిమెంట్ ఆటలు సాగవని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి నష్టపోయిన విషయాన్ని ప్రజలు గుర్తించారని స్పష్టం చేశారు.
Nellore District: నెల్లూరులో తెలుగుదేశం అభ్యర్థి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీత్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ ప్రభుత్వంలో నగర అభివృద్ధి కుంటు పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా లోని కొడవలూరులోని గ్రావెల్ తవ్వకాలను టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి పరిశీలించారు. గ్రావెల్ తవ్వకాలలో పిల్లలు పడి చనిపోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. ఎలక్షన్ సమయంలో కూడా కోడ్ ఉల్లంఘించి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు.