NDA alliance meeting : ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు. మూడు పార్టీల మధ్య సమన్వయం అంశాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తాను.. తన పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని అన్నారు. ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఏమైనా ఉంటే చెప్పాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులైనా కాలేదు.. అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారని మండిపడ్డారు. జగన్ సహజ ధోరణి వీడలేదని విమర్శించారు. సమావేశంలో జగన్ ఆందోళన అంశంపై ప్రస్తావించారు. అసెంబ్లీలో జగన్, వైఎస్సార్సీపీ తీరును ఎన్డీఏ శాసన సభా పక్షం తప్పు పట్టింది. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజునే అడ్డుకోవడం సరైన పనేనా అని ప్రశ్నించారు. తప్పులు చేయడం.. పక్క వారిపై నెట్టేయడం జగన్‌కు అలవాటని సీఎం మండిపడ్డారు. వివేకా హత్య విషయంలో ఇతురులపైకి నెపం నెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వినుకొండలోనూ ఇదే జరుగుతోందన్నారు. గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం మానేశాయనడానికి మదనపల్లె ఘటనే నిదర్శనమన్నారు. అర్ధరాత్రి ప్రమాదం జరిగితే మర్నాడు వరకు జిల్లా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సరిగా స్పందించలేదని విమర్శించారు. డబ్బుల్లేవని పనులు చేయలేం అని చెప్పలేమని, నిధులతో ఇబ్బందులున్నా పనులు చేయాలని అన్నారు. ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదామని చంద్రబాబు సూచించారు.
ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన చంద్రబాబు పాత్ర - Chandrababu Naidu became key Role
ఇసుక, శాంతి భద్రతలపై ప్రధానంగా సీఎం చంద్రబాబు చర్చించారు. తొలిరోజు సభలో జగన్ ప్రవర్తన అసహ్యం కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇసుక, శాంతి భద్రతలపై ప్రధానంగా సీఎం చర్చించారు. తొలిరోజు సభలో జగన్ ప్రవర్తన అసహ్యం కిలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలకు ఎవ్వరు విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే కఠినంగా శిక్షిద్దామని పిలుపునిచ్చారు. వివేకా హత్య కేసులో నడిపిన డ్రామానే వినుకొండ జిలానీ-రషీద్ వ్యవహారంలో నడపాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమి సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది.
కూటమి నేతల సమావేశానికి చంద్రబాబు వచ్చే ముందు పవన్ కళ్యాణ్, నేతల మధ్య అసెంబ్లీ పరిణామాలపై చర్చ జరిగింది. తొలి రోజునే సభలో వైఎస్సార్సీపీ చేసిన ఆందోళనను పలువురు సభ్యులు ప్రస్తావించారు. జగన్ సహా సభ్యులు ఫ్రస్ట్రేషనులో ఉన్నారని ఇంకొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. పోలీసులపై ఈ స్థాయిలో విరుచుకుపడి తనలోని అసహనాన్ని జగన్ బయటపెట్టుకున్నారని పలువురు జనసేన ఎమ్మెల్యేలు వెల్లడించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. రాష్ట్రానికి నిధుల కొరతను అధిగమించేందుకు కలసి కట్టుగా ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే అతనికి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. దిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా అతణ్ని పట్టించుకునేవారు లేరని ఎద్దేవా చేశారు.
మిత్రపక్షాల మధ్య విబేధాలను జగన్ కోరుకుంటున్నారని, ఆ అవకాశం ఇవ్వొద్దని కూటమి శాసనసభా పక్షం అభిప్రాయపడింది. కూటమి శాసనసభా పక్ష సమావేశంలో పార్టీల మధ్య సమన్వయంపై కీలక చర్చ జరిగింది. రాష్ట్ర స్థాయితో పాటు క్షేత్ర స్థాయిలోనూ మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో వెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీల మధ్య సమన్వయం కోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పార్టీల మధ్య సమన్వయ కమిటీల అవసరం ఉందని సీఎం చంద్రబాబు కూడా తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులకు ప్రతిపాదనలు పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. సొంత పార్టీ కార్యకర్తల పేర్లతో పాటు.. గెలుపునకు సహకరించిన మిత్రపక్ష నేతల పేర్లనూ సిఫార్సు చేయాలని చంద్రబాబు తెలిపారు.
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఇసుకపై కీలక చర్చ జరిగింది. ఇసుక రవాణా, లోడింగ్ ధరలు కొంత మేర ఇబ్బందిగా ఉన్నాయని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు తెలిపారు. పక్క జిల్లాల నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లల్లో ఉన్న ఇసుకను సరఫరా చేస్తున్నామని.. రీచుల నుంచి తెచ్చుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని సీఎం స్పష్టం చేశారు. పంట వేసిన నెల రోజుల్లో నష్టం విషయంలో తక్కువ మొత్తంలో పరిహారం ఇస్తున్నారని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ వర్తింప చేసేలా చూడాలన్న బొమ్మిడి నాయకర్ సూచనలను పరిశీలిస్తామని సీఎం అన్నారు. దిల్లీ నుంచి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.