Nara Lokesh Fires on YSRCP Government : సాక్షి పత్రిక అసత్యాలకు అడ్డుకట్ట వేయాలనే పరువు నష్టం పిటిషన్ వేసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా వార్తలు రాయడం ఆ పత్రిక నైజమని ధ్వజమెత్తారు. ఇప్పటికీ తీరు మార్చుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ అక్రమాలపై నిప్పులు చెరిగారు.
ఇతర రాష్టాలకు పెట్టుబడులు : సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ అని ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామిక వేత్తలు మళ్లీ రాష్ట్రానికి వస్తున్నారని ఐటీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్రంలో ప్రజాపాలన వచ్చిందని పారిశ్రామిక వేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేలా అదానీని గతంలో ఒప్పించామని, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని గుర్తు చేశారు.
మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుంటుంది : రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగాయని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ భూ అక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని, ఎన్ని ఎకరాలు ఎక్కడ అక్రమాలు జరిగాయో త్వరలో చెబుతామని తెలిపారు. అక్రమ కట్టడాలు ఉంటే మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
6 హామీలకు కట్టుబడి ఉన్నాం : వైఎస్సార్సీపీ హయాంలో మద్యం, ఇసుక, భూ అక్రమాలు జరిగాయని, మొన్నటి వరకు విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని, కిడ్నాప్‌లు జరిగాయని, అడ్డగోలుగా భూములు లాక్కున్నారని నిప్పులు చెరిగారు. విశాఖలో దసపల్లా భూములు లాగేసుకున్నారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని పాదయాత్రలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల రెండు ఫర్నేస్‌లు మూసివేశారని అన్నారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన 6 హామీలకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తొందర పాటు నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని లోకేశ్ కోరారు.
అన్న క్యాంటీన్లపై సైకో జగన్ బ్యాచ్ విష ప్రచారం : నారా లోకేశ్ - Tanuku Anna Canteen Issue
శనివారం పింఛన్ పంపిణీ : ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు, పింఛన్ ఒకటో తారీఖున చెల్లిస్తే గొప్ప అని తెలిపారు. సెప్టెంబర్ 1న ఆదివారం వచ్చిందని ఒకరోజు ముందుగానే పింఛన్ ఇస్తున్నామని అన్నారు. రూ. వెయ్యి పింఛన్ పెంచడానికి జగన్ ఐదేళ్లు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్ రూ.వెయ్యి పెంచామని గుర్తు చేశారు.
క్రీడలను ప్రోత్సహించాలి : సీఎం చంద్రబాబుతో సెప్టెంబర్ 11న ఉన్నతవిద్యపై సమీక్ష ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్‌ను బకాయిలు పెట్టిందని, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను కళాశాల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. ఏపీని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తనది తెలిపారు. క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని లక్ష్యం పెట్టుకున్నామని వెల్లడించారు.