Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: నారా భువనేశ్వరి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. అమలాపురం నుంచి నారా భువనేశ్వరి రెండో రోజు నిజం గెలవాలి పర్యటన ప్రారంభించారు. అయినివిల్లి మం. మూలపొలం బయలుదేరిన భువనేశ్వరి, అయినివిల్లి మండలం శానిపల్లిలంకలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించచారు.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆవేదనతో చనిపోయిన ఎస్. మూలపొలంలో మోరంపూడి మీరాసాహెబ్ కుటుంబ సభ్యుల్ని భువనేశ్వరి పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా 3 లక్షల రూపాయల చెక్కును భువనేశ్వరి అందించారు. బుధవారం పర్యటనలో కాకినాడ జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేపట్టారు. శుక్రవారం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరంలో భువనేశ్వరి పర్యటిస్తారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన
Nijam Gelavali Yatra: నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రను బుధవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించే యాత్రలో తొలిరోజు అయిన బుధవారం కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడ నగర నియోజకవర్గాల్లో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన పడాల వీరబాబు, తుని మండలంలోని తేటగుంట గ్రామంలో ఈసరపు నూకరాజు, పెద్దాపురం మండలం కాండ్రకోట వాసి బుద్దాల సుబ్బారావు కుటుంబాల్ని భువనేశ్వరి పరామర్శించారు.
టీడీపీ గెలుస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని వీరబాబు అంటూ ఉండేవారని కుటుంబ సభ్యులు భువనేశ్వరితో అన్నారు. వీరబాబు పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసేవారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఎన్టీరామారావు కుమార్తె, చంద్రబాబు సతీమణి తమ ఇంటికివస్తారని కలలో కూడా అనుకోలేదని సుబ్బారావు కుటుంబ సభ్యురాలు కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించారు. కుటుంబసభ్యుల్ని కోల్పోయిన మీరు ఎంత బాధలో ఉన్నారో తెలుసని, అండగా ఉంటాం అధైర్యపడొద్దంటూ టీడీపీ కార్యకర్తల కుటుంబసభ్యులతో భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కాకినాడలో జరిగిన దీక్షలో పాల్గొని గుండెపోటుతో చనిపోయిన నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి కుటుంబసభ్యులతో భువనేశ్వరి మాట్లాడారు. పార్టీకి సత్యవతి ఎనలేని సేవలను అందించారని అన్నారు. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని వారికి భువనేశ్వరి భరోసా ఇచ్చారు. పరామర్శ సమయంలో బాధిత కుటుంబీకులు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. భువనేశ్వరి వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా నేడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు.
నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - బాధిత కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సాయం