Nara Bhuvaneshwari Nijam Gelavali Closing Ceremony : నిజం అంటే నారా చంద్రబాబు నాయుడు, అబద్ధం అంటే సీఎం జగన్ మోగన్ రెడ్డి అని నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్ర ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగలో పాల్గొని ఆమె ప్రసంగించారు. నిజం గెలవాలి పేరుతో రాష్ట్రంలోని 94 నియోజకవర్గాల్లో 9070 కిలోమీటర్లు తిరిగి 203 కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించానని తెలిపారు.
హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది : నారా భువనేశ్వరి మాట్లాడుతూ నిజాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే తొలిసారి బయటకు వచ్చానని తెలిపారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని అన్నారు. తన యాత్రలో అనేక మంది ప్రజలను కలిసే అదృష్టం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన రోజు తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయన జైల్లో ఉన్న 53 రోజులు ఎలా బతికానో తనకే తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం బతికే నాయకుడిని జైలులో పెట్టారు. ప్రజలను అభివృద్ధి చెయ్యాలని ఆయన ఎంతగానో ఆలోచించారని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని భువనేశ్వరి తెలిపారు.
ప్రజాసమస్యలు చర్చించే అసెంబ్లీలో తనను అనరాని మాటలన్నారని గుర్తు చేశారు. దేవాలయం లాంటి సభను మహిళలను కించపరిచేందుకు వాడుకున్నారని, నాన్న ఇచ్చిన ధైర్యంతోనే అసెంబ్లీ పరిణామాలను తట్టుకోగలిగానని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళా శక్తిని చాటాలని నిర్ణయించానని పేర్కొన్నారు.
ఏపీని దేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలి : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావేదికని నిర్మిస్తే నిరంకుశంగా వ్యవహరించి దానిని అధికార ప్రభుత్వం కూల్చేసిందని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్నో వాటర్ ప్రాజెక్టులు తీసుకొచ్చారని అన్నారు. ఏపీని దేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొందరు అధికారులు కూడా కిరాతకంగా మారారని అన్నారు. కూటమి జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని తెలిపారు. మరో నెల రోజుల్లో మనం కురుక్షేత్ర యుద్ధం చేయబోతున్నామని అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలకండని ఆమె పిలుపునిచ్చారు.
చంద్రబాబు సీఎం అయ్యాక మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు: భువనేశ్వరి - Bhuvaneshwari Nijam Gelavali Yatra