Mudragada Padmanabham Reacts on His Name Change: రాష్టంలో మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయభేరి మోగించింది. కూటమి నేతలు ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ సమీప అభ్యర్థి వంగా గీతపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత అసెంబ్లీ బరిలో దిగిన సమయంలో పవన్ గెలుపుపై తాను చేసిన సవాల్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ స్పందించారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన ఆయన అన్నంతపనే చేస్తున్నారు. ఏదో మాట వరసకు తన పేరును మార్చుకుంటానని చాలామంది సవాల్ చేస్తుంటారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టటంలో వెనకడుగు వేస్తారు. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.
కిర్లంపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తామని సవాల్ చేశానని, అలా చేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ క్రమంలో ఆయన పేరును మార్చుకునేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పద్మనాభం వైఎస్సార్సీపీ ఘోర ఓటమిపై విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓటర్లు ఎందుకు ఆదరించలేదో అర్థం కావట్లేదని అన్నారు. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఏది ఏమైనా తన రాజకీయ నడక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుకే అని ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు.
"పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడిస్తామని సవాల్ చేశాను. అలా చేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పాను. అన్నట్లుగానే నేను నా పేరును మార్చాలని గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటాను." - ముద్రగడ పద్మనాభం, వైఎస్సార్సీపీ నేత