MP Ticket To Avinash Reddy : ''ఎవరేమనుకుంటే నాకేంటి నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు'' అన్నట్లుగా ఏపీ సీఎం జగన్ అవినాష్‌రెడ్డికి మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న బిడియం ఏ కోశాన లేదు. ప్రతిపక్షాల నుంచి విమర్శలొస్తున్నా లెక్కచేయరు. సొంత చెల్లి, బాబాయ్ కుమార్తె ప్రశ్నించినా వినిపించుకోలేదు. కనీసం ఓట్లు వేసే జనం ఏమనుకుంటారోననే ఆలోచన కూడా చేయలేదు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని ఇన్నాళ్లూ కంటిపాపలా కాపాడుకుంటూ వచ్చిన జగన్ ఆయన్ని మళ్లీ కడప ఎంపీ అభ్యర్థిగా కొనసాగించడం ద్వారా తన నియంతృత్వ పోకడను మరోసారి గట్టిగానే చాటుకున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో దిల్లీకి వెళ్లినప్పుడు పార్టీ ఎంపీలెవరినీ వెంటబెట్టుకుని వెళ్లని సీఎం అవినాష్‌ను మాత్రం తీసుకెళ్లి దిల్లీ పెద్దలను కలిసేవారు. న్యాయపరంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా అన్ని సందర్భాల్లోనూ అవినాష్‌కు అండగా నిలుస్తూ వస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అవినాష్ ప్రస్తావన తీసుకువచ్చినప్పుడల్లా ఆ సంస్థపై వైసీపీ నేతలు, ముఖ్యంగా సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో విమర్శలు, ఆరోపణలు చేయిస్తున్నారు.
'ఏపీలో మోదీని ప్రశ్నించే గొంతులు లేవు - పాలించే నాయకులు కాదు ప్రశ్నించే గొంతు కావాలి'
YSRCP MP Candidates : కర్నూలులో అవినాష్ ను అరెస్టు చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులపై దాడులకూ తెగబడ్డారు. చివరకు సాంకేతికంగా కాగితాలపైనే అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేయడం, బెయిల్ మంజూరవడం అందరికీ తెలిసిందే. వివేకా హత్యకేసు విచారణకు ఏపీలో ఆటంకాలు కలుగుతున్నందున కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా ‘ఈ కేసులో సాక్షులకు తగిన భద్రత లేదు.
స్వేచ్ఛగా, న్యాయమైన విచారణ జరిగే వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించడం లేదు’ అని సర్వోన్నత న్యాయస్థానమే ఆందోళన ప్రకటించడం గమనార్హం. తర్వాత హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివేకా కేసును బదిలీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐకి అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. వివేకా హత్య కేసులో సాంకేతికంగా బెయిల్‌పై ఉన్న అవినాష్‌నే జగన్ మళ్లీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు.
వివేకా హత్య కేసు దర్యాప్తు : రాష్ట్రంలో జగన్ అధికారంలోకొచ్చాక వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన్ను కోరినట్లు వివేకా కుమార్తె సునీత మీడియా సమావేశంలో తెలిపారు. ఆ సందర్భంలో జగన్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే అవినాష్‌రెడ్డి బీజేపీలోకి వెళతాడని చెప్పారని సునీత పేర్కొన్నారు. కేసు సీబీఐకి వెళ్తే ఆ సంస్థ దర్యాప్తు చేసే తన 12వ కేసవుతుందని జగన్ చెప్పినట్లు వెల్లడించారు. అలాంటి వ్యాఖ్యలు జగన్ ఎందుకు చేశారో అప్పుడు తనకు అర్థం కాలేదని సునీత అన్నారు. మరి ఇప్పుడు అవినాష్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదు. ఆయన్ను ఆ పార్టీ తీసుకుని కడప టికెట్ ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. అయినా అవినాష్‌ను తన పార్టీ లోక్‌సభ అభ్యర్థిగానే జగన్ కొనసాగించడం వెనుక ఆంతర్యమేంటో ఆయనకే తెలియాలి.
జగన్ మాటల్లోనే 'నా' చేతల్లో 'నో'- సొంత సామాజికవర్గానికే మరోసారి పెద్దపీట
చరిత్రలో నిలిచేలా ప్రజాగళం సభ - పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి ముగ్గురు అగ్రనేతలు