MP Dharmapuri Arvind Fire on Minister Uttam Kumar Reddy : రాష్ట్రంలో సీఏఏ అమలు చేయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ అధికారంతో అన్నారని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్మీట్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టం దేశం మొత్తం అమలు చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) అన్నారు. అంతేగానీ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న అధికారం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ముస్లిం ఓట్లు కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఏఏ(CAA), ఎన్‌ఆర్‌సీకి ముస్లింలకు సంబంధమే లేదన్నారు. తెలంగాణను రోహింగ్యాలకు అడ్డాగా చేద్దామని అనుకుంటున్నారా అంటూ మంత్రి ఉత్తమ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
'గెలుపు దగ్గరి దాకా వచ్చి ఓడిపోయాం - అసెంబ్లీ ఎన్నికల్లో నైతిక విజయం మనదే'
Dharmapuri Arvind on CAA : ఆర్టికల్ 786 తెద్దామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారా అని ఎంపీ అర్వింద్ విమర్శలు చేశారు. ఇప్పటికే కేసీఆర్ బోధన్‌ను రోహింగ్యాలకు అడ్డాగా మార్చారని దుయ్యబట్టారు. అలాగే జగిత్యాలను కాంగ్రెస్ అభ్యర్థి పీఎఫ్‌ఐ(PFI) కి అడ్డాగా చేశారని ఆరోపించారు. అందుకే మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. వెంటనే మంత్రి వర్గం నుంచి ఉత్తమ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీని చూసి భవిష్యత్ తరాల కోసం ఓటు వేయాలని ఎంపీ అర్వింద్ కోరారు.
"తెలంగాణలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయమని అధికారికంగా చెబుతున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో పాస్ అయిన చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పని ఈయన మీద ఉంది. సీఏఏ దేశంలో అమలు అవుతుంది. రాష్ట్రంలో అమలు చేయమని చెప్పడానికి ఈయన ఎవరు?. ఈయనకు ఏం అధికారం ఉంది. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు." - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
అసలేం జరిగింది : మంగళవారం కోదాడలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయంపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ భగ్గుమన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ది రెండో స్థానం, బీఆర్ఎస్కు ఈసారి డిపాజిట్లూ దక్కవు : ఎంపీ అర్వింద్