Money Distribution in Election Telangana : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. అప్పటి నుంచే అసలు ఆట మొదలైంది. అదే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి పార్టీ నాయకులు చేసే ప్రలోభాల పర్వం. ఓటింగ్ ప్రక్రియలో ఓటరు తమ ఓటు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్చందంగా తమ నిర్ణయాన్ని తెలియజేయాలి. కొంత మంది నాయకులు ఓటమి భయంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ కొందరు పట్టుపడుతున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కొన్ని సంఘటనలు జరిగాయి. పోలీసులు వారిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు.
Telangana Money Distribution for Elections : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని తొగుట మండలం కాన్గల్ శివారులో ఓ రైతు వ్యవసాయ పొలం వద్ద పట్టు పురుగుల షెడ్డులో 660 కూల్ డ్రింక్స్ బాటిల్స్ దాచిపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని ధర్మాజీపేటలో బీఆర్ఎస్ నేతలు నగదు పంచుతుండగా బీజేపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో ఓ వ్యక్తి దగ్గర నుంచి రూ.11,500 పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
EC Flying Scade Search Congress Leader Madhu Yashki : రంగారెడ్ది జిల్లా హయత్‌నగర్‌లో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇంటి వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికలు సోమవారం జరగనున్న నేపథ్యంలో మధుయాష్కీ గౌడ్ నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు ఈసీ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు రైడ్ చేశారు. మాజీ ఎంపీ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఓటమి భయంతోనే ఓ బీజేపీ నేత తనపై కుట్ర పన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మధుయాష్కీ విమర్శించారు.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రలోభాలకు గురి చేసే వారిపై, సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ నిఘా పెట్టింది. ప్రచారం జరిగినప్పటి నుంచి ఓటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు సమయం చాలా కీలకమని సీఈవో వికాస్‌రాజ్ ఇదివరకే తెలిపారు. దీంతో ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. తమకు అనుమానం వచ్చిన ప్రతిచోట తనిఖీలు నిర్వహిస్తున్నారు.