MLA Danam Shocking Comments On BRS Leaders : శుక్రవారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీలో సమావేశాల్లో తనను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కావాలనే టార్గెట్ చేశారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడేటప్పుడు ఆటంకం కలిగించారని తెలిపారు.
అసెంబ్లీలో నిన్న తనను కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. బయటకు చెప్పలేని పదాలతో దూషించారని దానం వాపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడింది మైక్‌లో రికార్డ్ కాలేదని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డిని, తనను కించపరిచే విధంగా మాట్లాడడం వల్లనే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలు హైదరాబాద్ వాడుక భాషనేనని తెలిపారు. అయితే, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధ కలిగిస్తే క్షమాపణ చెప్తున్నట్లు పేర్కొన్నారు. అధికారం కోల్పోవడం వల్లనే బీఆర్ఎస్ నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుండి బీఆర్ఎస్ నాయకులు సభను సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని దానం పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఏనాడు తన లాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధికి సహకరించి తమ పద్ధతిని మార్చుకోవాలని దానం హితవు పలికారు. ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో దానం ఈ వ్యాఖ్యలు చేశారు.
'అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నన్ను, సీఎంను కించపర్చే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడింది మైక్‌లో రికార్డు కాలేదు. తన మాటలు రికార్డు అయ్యాయి. గత పదేళ్లలో నాలాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడం దురదృష్టకరం.' దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే
ఏం జరిగిందంటే : హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై శుక్రవారం శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం బీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయట తిరగనియ్యనంటూ పరుష పదజాలంతో దానం బెదిరింపులకు పాల్పడ్డారు.
దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. శాసనసభ స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. పోడియం దగ్గర నిరసన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులవైపు దానం నాగేందర్ దూసుకెళ్లారు. వెంటనే ఆయనను కాంగ్రెస్ సభ్యులు వెనక్కి లాగారు. ఆ వెంటనే బీఆర్ఎస్ సభ్యులను కేటీఆర్ తీసుకొచ్చారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను దానం నాగేందర్ వెనక్కి తీసుకుంటున్నానని, సభాపతికి క్షమాణలు చెప్పారు.