Minister Satya Kumar Yadav Speech in AP Assembly Session 2024: కేవలం రాజకీయ కారణాలతో జగన్ ప్రభుత్వం ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరును మార్చిందని ఆరోగ్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. పేరు మార్పు వల్ల అనేక వర్సిటీలో అడ్మిషన్లకు, విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుడైన ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎలా వచ్చిందోనని దుయ్యబట్టారు.
ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుపై మంత్రి సత్యకుమార్ నేడు శాసనసభలో చర్చించారు. విజయవాడలో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్సార్ పేరు పెడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు చేసే బిల్లుపై అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చను ఎమ్మెల్సీలు ఆసక్తిగా పరిశీలించారు. శాసనమండలి లాబీల్లో హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్దరణపై తెలుగుదేశం ఎమ్మెల్సీల మధ్య చర్చ జరిగింది. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టిన నాటి రోజులను మండలి టీడీపీ శాసనసభాపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు గుర్తు తెచ్చుకున్నారు. కొన్ని పేర్లను మార్చడం తప్పని వ్యాఖ్యానించారు.
దేవుని గడపగా ఉన్న కడప పేరునూ మార్చేశారని యనమల విమర్శించారు. ఇప్పటికీ పాత కడప నుంచి చాలామంది తిరుమలకు వెళ్తున్నారని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. పవిత్రమైన కడప పేరును తీసేసి ఏకంగా వైఎస్సార్ జిల్లా అని పెట్టేశారని దుయ్యబట్టారు. దేవుని గడపగా ఉన్న పేరు తరువాత కడపగా మారినందున భగవంతుడి సెంటిమెంట్‌తో ఇది ముడిపడి ఉన్న అంశమని పంచుమర్తి అనురాధ, అశోక్‌బాబు అన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ కడప జిల్లా పేరు మారుస్తూ ప్రతిపాదన పెడదామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
జగన్ దుర్మార్గంగా హెల్త్ వర్సిటీ పేరు మార్చారని, దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారని అరవింద్‌బాబు మండిపడ్డారు. వందల కోట్ల వర్సిటీ నిధులను జగన్ దారి మళ్లించారన్న ఆయన హెల్త్ వర్సిటీ నిధుల మళ్లింపుపై విచారణ చేయించాలన్నారు. ఎన్టీఆర్ ఆలోచన నుంచే హెల్త్ వర్శిటీ వచ్చిందని ఎమ్మెల్యే రఘురామరాజు అన్నారు. ఎన్టీఆర్‌వర్శిటీని చంద్రబాబు అభివృద్ధి చేశారని, అయితే శ్మశానవాటికలు మినహా అన్నింటికీ జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ ప్రచారపిచ్చితో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అన్నింటిపైనా జగన్ తన ఫొటో వేయించుకున్నారని విమర్శించారు. పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లపైనా చిత్రాలు ముద్రించుకున్నారని, ఆఖరికి ఆస్పత్రి ఓపీ స్లిప్పులపైనా జగన్ తన ఫోటో వేయించుకున్నారని మండిపడ్డారు.