Minister Ponnam Prabhakar on Karimnagar MP Candidate : కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అందుకే సోమవారం మంచి రోజు అవ్వడంతో నామినేషన్ వేయించామని తెలిపారు. పార్టీ అధిష్ఠానం త్వరలోనే అధికారకంగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం బీజేపీపై విమర్శలు చేశారు.
Ponnam Prabhakar Fires on BJP : మొదటి దశ ఓటింగ్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకీ వణుకు పుడుతోందని మంత్రి పొన్నం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముస్లింలకు ఆస్తులు పంచుతుందని ప్రధాని చెప్పడం విచారకరమని మండిపడ్డారు. పాంచ్ న్యాయ్, కులగణన లాంటి పలు అంశాలు కమలం పార్టీకి రుచించడం లేదని విమర్శించారు. ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోదీ దారుణంగా మాట్లాడుతున్నారని, ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు.
"ఉపాధి హామీ నిధులు కూడా తానే తెచ్చినట్లు బండి సంజయ్ చెప్పుకోవడం సిగ్గుచేటు. కరీంనగర్ నియోజవర్గానికి ఎంపీగా ఏం చేశావు?. తల్లీ-బిడ్డల గురించి అవమానకరంగా మాట్లాడారు. పీజీ వేరే రాష్ట్రంలో చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ఎక్కడ చేశారో చెప్పాలి. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తీసేసారో చెప్పాలి. వినోద్ కుమార్‌తో బండి సంజయ్ కలిసిపోయారు. కరీంనగర్లో సీటు గెలుస్తాం." - పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి
Congress Election Campaign in Karimnagar : కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం చేశామని మంత్రి తెలిపారు. 80 శాతం పైగా ఉన్న హిందువులకు బీజేపీ ఏరోజైనా అన్యాయం చేసిందా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులందరూ దేవుని ఫొటోలు తప్ప నరేంద్ర మోదీ ఫొటోలతో ఎలాంటి ప్రచారం చేయలేదని అన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియోను వక్రీకరించి ఎన్నికల్లో లబ్ధి కోసం ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలోని మెజార్టీ రైతులు, హిందువులేనని వారికి వ్యతిరేకంగా ఎందుకు నల్ల చట్టాలు తెస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. మోదీ మతత్వవాది అని రాహుల్ గాంధీ మానవతా వాది అని అన్నారు. ప్రజలు నియంతృత్వానికి 2024లో తీర్పునీయబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఐపీఎల్ టీమ్‌లో మోదీ ఒక్కడే లీడర్ అని హస్తం పార్టీ టీమ్‌లో ఇండియా కూటమి అని వివరించారు. కాంగ్రెస్‌కు పెద్ద టీం ఉందని పేర్కొన్నారు.