Minister Ponguleti Srinivas Reddy Chit Chat : ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో బయటపెట్టి, శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత సర్కారు ధరణిని రహస్య డాక్యుమెంట్‌గా చూసిందని, తమ ప్రభుత్వం ఏదీ దాచి పెట్టదని స్పష్టం చేశారు. ధరణిలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగించి, మంచి వాటిని కొనసాగిస్తామన్నారు. నేడో, రేపో 5 ఎకరాల వారికి రైతుబంధు పూర్తవుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
రిజిస్ట్రేషన్ల శాఖను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పొంగులేటి పేర్కొన్నారు. విద్యుత్ సమస్య నుంచి బయటపడ్డామని, మంచినీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. వేసవిలో మంచి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్తలను గత ప్రభుత్వం తీసుకోలేదని, పైగా తమపై రాళ్లు వేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసే ప్రసక్తే లేదన్నారు. మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో చర్చించి జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.
త్వరలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
అదంతా ఊహాజనితం : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 14 స్థానాలు గెలుస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఒకటో, రెండో వస్తే అదే గొప్ప అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను బీజేపీ సహా ఏ ఇతర పార్టీలతో టచ్‌లో లేనని, పార్లమెంటు ఎన్నికల తర్వాత తానే సీఎం అనడం ఊహాజనితమని మంత్రి అన్నారు. తాను సీఎం కావాలని కోరుకోవడం లేదని, అలాంటి ఆలోచనే లేదన్నారు.
గేట్లు ఎత్తితే వరదే : ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి రమ్మని ఎవరినీ అడగడం లేదని, గేట్లు ఎత్తితే వరదేనన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొందరు స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ అవినీతిని చక్కదిద్ది వ్యవస్థను దారిలో పెడుతున్నామని, పక్కదారి పట్టిన సొమ్మంతా కక్కిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పనుల కోసం కేంద్రాన్ని కోరతామని, అవసరమైతే పోరాడేందుకు కూడా వెనకాడమన్నారు.
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేయలేదు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి : పొంగులేటి