Minister Payyavula Keshav on YSRCP Govt: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో మీడియాతో మాట్లాడారు. గతంలో జిల్లా కలెక్టర్లు తక్షణ పరిష్కారం కింద రూ. 50 లక్షల వరకు మంజూరు చేసే అవకాశం ఉండేదని, అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కలెక్టర్లు కనీసం రూ.లక్ష మంజూరు చేయడానికి కూడా అవకాశం లేని వ్యవస్థను తీసుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీని కారణంగా తాగునీరు, రోడ్లు, వైద్యం సంబంధిత అంశాల్లో నిధులను మంజూరు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. అంతే కాకుండా జిల్లా గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి తగిన మార్గం లేకుండా పోయిందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుప్పకూల్చిన ఆ వ్యవస్థకు తిరిగి పూర్వ వైభవం తీసుకు రావడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పయ్యావుల తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రాన్ని విడుదల చేసిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దాని ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే రూ. 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని వివరించారు. తక్షణం తెల్లించాల్సిన బకాయిలు రూ. లక్ష కోట్లు ఉన్నాయని అన్నారు. రోజుకు రూ.4 వేల కోట్లు చెల్లిస్తే తప్ప బకాయి తీరవని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో స్పష్టమైన ప్రణాళికతో, సీఎం సూచించే మార్గదర్శకాలతో ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఉన్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. గతంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లు తక్షణ పరిష్కారం కింద రూ. 50 లక్షల వరకు మంజూరు చేసే అవకాశం ఉండేది. తరువాత జగన్ అధికారంలోకి వచ్చాక కలెక్టర్లు కనీసం రూ.లక్ష మంజూరు చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. దీని కారణంగా జిల్లా గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి తగిన మార్గం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ కుప్పకూల్చిన ఆ వ్యవస్థకు తిరిగి పూర్వ వైభవం తీసుకు రావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంది.- పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి