Minister Narayana Review on Tirupati Urban Development: యువతకు ఉద్యోగావకాశాలు కలగాలంటే పరిశ్రమలు రావాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాలని అన్నారు. రాష్ట్రానికి వాటిని తీసుకొచ్చే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలిపారు. రెండు నెలల్లోనే 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు.
తిరుపతి నగరపాలక సంస్థ, పట్టణాభివృద్థిపై తుడా కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నగరంలో తాగునీటి సరఫరా, యూడీఎస్‌ల పనితీరుపై సమీక్షించారు. కండలేరు, బాలాజీ జలాశయాల్లో నీటి నిల్వల వివరాలు అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరవాసులకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని వారానికి ఒకసారి తాగునీటిని పరీక్షించాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ సమావేశంలో సుగుణమ్మ, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని మున్సిపల్ కమిషనర్ మౌర్య, తుడా వైస్ ఛైర్మన్ వెంకటనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీడీఆర్ అక్రమాలపై విచారణకు కమిటీ: మున్సిపల్ శాఖలోని సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి నారాయణ అన్నారు. టీడీఆర్ బాండ్లలో రూ.వేల కోట్ల పక్కదారి పట్టాయని సెప్టెంబర్ చివరి నాటికి ఆ అక్రమాలను తేలుస్తామని మంత్రి తెలిపారు. ఈ టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైసీపీ పాలనలో అవినీతిని కొత్తపుంతలు తొక్కించారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయని వివరించారు. 2014-19 వరకు నగరాలు, పట్టణాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో గణనీయమైన అభివృద్ది జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన కొత్త చెత్తపన్నును త్వరలోనే తొలగిస్తామని స్పష్టం చేశారు.
తుడాలో జీతాలకే రూ.15 కోట్లు ఖర్చు: 2023-24లో రూ.450 కోట్లు కేంద్రం కేటాయించిన నిధులను జగన్ దారి మళ్లించారని మంత్రి నారాయణ ఆరోపించారు. తుడాలో జీతాలకే రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మరే అభివృద్ది సంస్థకు లేని రీతిలో తుడాలో వ్యయం చేస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థలో ఉద్యోగులను నియమించి వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని వాటిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్నిమాపక, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలతో మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్ను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. ప్రజలను కార్యాలయాల చుట్టు తిప్పకుండా వీలైనంత త్వరగా అనుమతులివ్వాలని ఆదేశించినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యం - కిడ్నీ బాధిత గ్రామాలకు శాపం - Kidney Disease Problems