Minister Nara Lokesh on Red Book In AP : రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తప్పు చేసిన వారి పేర్లే రెడ్‌బుక్‌లో ఉన్నాయని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడ వరద సాయంపై ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలకు బ్లూ-బ్యాచ్ ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని తేల్చిచెప్పారు.
చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్‌కి రెడ్ బుక్‌లో తమ పేరు ఉందో లేదో అనే కంగారు ఉందని, యాక్షన్ అయితే అనివార్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ వాళ్లు ఏ పుస్తకం పెట్టుకున్నారో వాళ్లకే స్పష్టత లేదు కానీ తన నుంచి ఇన్స్పైర్ అయ్యారని అర్ధమైందన్నారు. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయని వెల్లడించారు. పరిపాలన ఒకే దగ్గర ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
జగన్‌కి ఇంకా ఆ అలవాటు పోనట్లుంది: కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారన్నారు. బ్లూ బ్యాచ్ ఆగడాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఇబ్బంది అనిపిస్తే ఎంతమాత్రం ఉపేక్షించమని తెలిపారు. వరదలొస్తే జగన్‌లా పరదాలు కట్టుకుని చంద్రబాబు అండ్ టీమ్ ఇంట్లో కూర్చోలేదన్నారు. జగన్‌కి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుంది ఎద్దేవా చేశారు. గతంలో ఇలానే ఆత్మలతో మాట్లాడి కియా తమ ఘనతే అంటున్నారని విమర్శించారు. ఇప్పుడు టీసీఎస్ గురించి ఏ ఆత్మతో మాట్లాడారని ప్రశ్నించారు. జగన్ హయాంలో తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ తెస్తున్నామని స్పష్టం చేశారు. లూలూ, అశోక్ లైల్యాండ్లే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.
ఫేక్ న్యూస్ ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు: ఫేక్ న్యూస్ ప్రచారం చేయడమే వైఎస్సార్సీపీ నేతల పని అని లోకేశ్ మండిపడ్డారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని, న్యాయబద్ధంగా ముందుకెళ్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో వెనుకాడేది లేదన్న లోకేశ్, గతంలో వరదలు వస్తే జగన్ బయటకు రాలేదని, బాధితులను పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. పరదాలు కట్టుకుని తిరగడం వాళ్లకే అలవాటని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమని తేల్చిచెప్పారు.