Minister Komatireddy Venkat Reddy Comments on KCR : కేసీఆర్ అసమర్థ పాలన వల్ల జిల్లాలో నీళ్లులేని పరిస్థితి నెలకొందని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం(Kaleshwaram)ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సత్వరమే వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈనెల నుంచి కరెంట్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 200 యూనిట్లు కరెంట్ ఇవ్వడం తమకు పెద్ద సమస్య ఏమీ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని భరోసా అన్నారు. నల్గొండ (Nalgonda) జిల్లాలో మంచినీళ్లు లేకపోవడానికి కారణం కేసీఆర్ అని మండిపడ్డారు. మిషన్ భగీరథ (Mission Bhagiratha)పేరుతో పెద్ద ఎత్తున అవినీతీకి తెరతీశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌పై విచారణ జరుగుతుందని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు.
'200 యూనిట్ల కరెంట్ ఇస్తానికి మాకు పెద్ద సమస్య ఏమీ కాదు. సంవత్సరానికి రూ. 400 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ వ్యవస్థను గాడిలో పెట్టేలా, ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నాం. ఈ పథకాలన్నీ 100 రోజులలోపే అమలు చేస్తాం. 120 నెలలు అధికారంలో ఉన్నా రేషన్‌కార్డు, ఇళ్లు ఇవ్వని వాళ్లు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మంచినీటి కొరత రావడానికి కారణం కేసీఆరే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కోటి 50 లక్షల అర్జీలు వచ్చాయంటే తెలంగాణలో ఏం జరిగిందని అర్థం చేసుకోవాలి. నిన్న పగిడిమర్రి గ్రామంలో ఆరు బోర్లు వేస్తే ఆరు ఫెయిల్ అయ్యాయని సర్పంచులు చెబుతున్నారు. ఏ గ్రామల్లో చూసినా నీళ్లు లేవు. కాళేశ్వరం పేరుతో రూ. 1,70,000 వేల కోట్లు వృథా చేశారు. ఆ డబ్బునే గులాబీ నేతలు కూడా దోచుకున్నారు' - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రోడ్లు, భవనాలు శాఖ మంత్రి
Minister Komatireddy Venkatreddy on BRS Leaders : నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రిపుల్ ఆర్(RRR)తెలంగాణకు మణిహారమని, అలైన్‌మెంట్ మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. ఆ విషయంపై ఇప్పటికే అధికారులతో సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు, కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేది : కేటీఆర్