Minister Komatireddy Comments on Modi And KCR : నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే దేశంలో ఎన్నికలే జరగవని, ఓట్ల కోసం ఆయన మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దేశం మొత్తం బీజేపీ నాయకుల ఆధీనంలోకి వెళ్తుందని పేర్కొన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
"కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలు ప్రపంచంలో ఏ నేత కూడా చెప్పలేదు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని గులాబీ అధినేత లక్షసార్లు చెప్పారు. గత ఎన్నికల్లో నల్లధనం తెస్తామని ప్రచారం చేసి గెలిచిన మోదీ, ప్రస్తుతం రాముని జపం చేస్తున్నారు. అదానీ, అంబానీ చేతుల్లో దేశ సంపద ఉంది. జీఏస్టీ రూపంలో భారీ మోసం జరుగుతోంది." అని కోమటిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
డిపాజిట్ల కోసమే బస్సు యాత్ర : కేసీఆర్ అబద్ధాలు రామాయణం కంటే పెద్దగా ఉన్నాయని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. డిపాజిట్ల కోసమే ఆయన బస్సు యాత్ర చేస్తున్నారని అన్నారు. ఓట్ల కోసమే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ రెండు రోజులు కాదు శాశ్వతంగా ఆంక్షలు విధించాలని వ్యాఖ్యానించారు. జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని తెలిపారు. ఆ పార్టీ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కూడా తమ పార్టీలోకి వస్తామని తనను సంప్రదించారని చెప్పారు.
డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 అసెంబ్లీ సీట్లు అవుతాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆ 154 సీట్లలో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక సోనియా గాంధీ కాళ్లను కేసీఆర్ మొక్కారని తెలిపారు. అప్పటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మోసగించారని మండిపడ్డారు.
'2013లో నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మార్చుతానని అన్నారు. 500 బహిరంగ సభల్లో ప్రధాని కావాలని బయట దేశంలో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి పేదవారి ఖాతాలో వేస్తామని అన్నారు. చెప్పిన మాట మీద నిలబడలేదు. ఇచ్చిన ఒక్క హామీ అమల్లోకి తీసుకురాలేదు.'- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి