Manda Krishna Madiga Fires On CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేశారని నమ్మక ద్రోహం చేసి మాదిగలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. సీఎం మాలలకు కొమ్ముకాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎంపై ఆరోపణాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మాలల పక్షాన నిలుస్తున్నారు : హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. సీఎం మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఆచరించకుండా మాలల పక్షాన నిలుస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో మాదిగల నాలుగు సీట్లు తగ్గడానికి రేవంత్ రెడ్డే కారణమని దుయ్యబట్టారు. వివేక్, వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలుండగా వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆక్షేపించారు.
"ఒక ఇంట్లో ఇద్దరికి టికెట్లు ఇవ్వద్దు అని కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కానీ వినోద్, వివేక్‌కి ఇచ్చారు. మళ్లీ వంశీకి టికెట్ ఇచ్చారు. వివేక్ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. మాదిగల పట్ల తనకు ప్రేమాభిమానాలు ఉన్నాయని నమ్మించడానికి తియ్యటి మాటలు చెబుతారు." - మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
వర్గీకరణ లేకుండానే బుధవారం 11వేల ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నారని విమర్శించారు. మాల సామాజిక వర్గానికి చెందిన మల్లిఖార్జున ఖర్గే, కొప్పుల రాజు ఆగ్రహానికి గురై పదవి కోల్పోవాలా అని రేవంత్ రెడ్డి మాదిగ ఎమ్మెల్యేలతో అన్నారని అవసరమైతే త్వరలో ఆ ఎమ్మెల్యేల పేర్లు బయటపెడతానని స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచణపై చర్చిస్తామన్నారు.