Major Changes in YSRCP: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్సీపీలో ఇప్పుడు కొన్ని మార్పుచేర్పులకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. గత కొద్దిరోజులుగా కుటుంబ వ్యవహారాలతో రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు వేశారు. టెక్కలి నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు.
పేరాడ తిలక్‌కు నియోజకవర్గ బాధ్యతలు: కుటుంబ గొడవల నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై వైఎస్సార్సీపీ అధిష్ఠానం చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి దువ్వాడను తొలగించి, ఆ పార్టీ సీనియర్ నేత పేరాడ తిలక్‌కు ఇన్‌ఛార్జిగా నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది.
ఇటీవల టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య వాణి చేపట్టిన నిరసన దీక్ష ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ వాణి, ఆయన పెద్ద కుమార్తె హైందవి దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త దివ్వల మాధురితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని దువ్వాడ వాణి ఆరోపించారు. సమస్య పరిష్కారానికి రెండు కుటుంబాల మధ్య చర్చలు సైతం జరిగాయి. దువ్వాడ శ్రీనివాస్, వాణి ఇప్పటికే టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన వైఎస్ జగన్, టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగించారు.
మరికొన్ని మార్పులు: దువ్వాడ శ్రీనివైస్పై వేటుతో పాటు పార్టీలో మరికొన్ని మార్పులు సైతం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి (పులివెందుల), మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి) లను నియమించారు. వీరికి రాష్ట్రస్థాయిలో కొన్ని జిల్లాల పార్టీ సమన్వయ బాధ్యతలను సైతం అప్పగించనున్నారు. వీటితోపాటు మరికొన్ని మార్పుల వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి ఇటీవలే ఆళ్ల నాని రాజీనామా చేశారు. దీంతో అతని స్థానంలో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లోనూ మార్పులు చేశారు. ఆయా విభాగాల రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, బీసీ విభాగానికి ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగానికి గంజి చిరంజీవి, విద్యార్థి విభాగానికి పానుగంటి చైతన్యను నియమించారు.
కుటుంబ కలహాలతో హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ - Duvvada Approached to High Court