MLC Election Campaign in Nalgonda : శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పట్టభద్రుల ఉపఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధిక మెజార్టీ సంపాదించుకునేలా పావులు కదుపుతోంది. అందుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న పునరుద్ఘాటించారు. ఖమ్మంలో ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి పట్టభద్రులంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు సీపీఐ మద్దతు ప్రకటించింది.
"ఒకవైపు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోదీ చెప్పారు. మరోవైపు జీవో 46 తీసుకువచ్చి పేదవర్ణవర్గాల అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి వస్తున్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని వస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బరిలో నిల్చుంటున్న. పట్టభద్రులందరూ ఆలోచించి ఓటు వేయాలి. నాకు మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు." - తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ అభ్యర్థి
BRS Speedups MLC Bypoll Campaign : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ, మిర్యాలగూడ, సాగర్, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో జరిగే ప్రచార సమావేశాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై విమర్శల వర్షం గుప్పించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విద్యావంతులదే కీలకపాత్ర అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో నిర్వహించిన పట్టభద్రుల సభల్లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
BJP Candidate MLC Election Campaign : పట్టభద్రుల ఓట్లు అడిగే ముందు అనేక ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్, ఖమ్మంలో నిర్వహించిన వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న . ఈటల ఉపాధ్యాయుల మీద లాఠీ ఝులిపించిన కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెడుతున్న హస్తం పార్టీకి బుద్ది చెప్పేందుకు విద్యావంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - ఫుల్ స్వింగ్‌లో ప్రచారం - Graduate MLC BY Campaign in TS