Pinnelli Brothers Missing : పోలింగ్ రోజు నుంచి కొనసాగుతున్న దాడులు, పోలీసుల 144 సెక్షన్, భారీ స్థాయిలో పట్టుబడిన బాంబులు, మారణాయుధాలు, తాజాగా ఎస్పీ సహా, డీఎస్సీలు, సీఐలు, ఎస్ఐలపై సస్పెన్షన్.. అసలు పల్నాడులో ఏం జరుగుతోంది? పిన్నెల్లి సోదరుల అదృశ్యం వెనుక కారణాలేమిటి?
ఈ నెల 13న జరిగిన పోలింగ్ మొదలుకుని పల్నాడులో జరుగుతున్న పరిణామాలు యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పోలింగ్ రోజున ప్రత్యర్థి, టీడీపీ నేత కారు ధ్వంసం, శ్రేణులపై దాడులతో మొదలైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు రోజురోజుకూ శృతిమించిపోయాయి. కారంపూడిలో ఏకంగా టీడీపీ కార్యాలయాన్నే ధ్వంసం చేసిన ఆ పార్టీ నేతలు టీడీపీకి ఓటు వేసిన సామాన్య జనంపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి సైతం అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారని గన్‌మెన్‌లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 144 సెక్షన్ నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న పిన్నెల్లి సోదరులు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని వైఎస్సార్సీపీ నేతలు చెప్తున్నారు. కాగా, కారంపూడి ఘటనలో అరెస్టు చేస్తారనే భయంతో వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
సీఈసీ తీవ్ర ఆగ్రహం : రాష్ట్రంలో అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతా జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహించారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు పోలీస్ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి డీజీపీ గుప్తాపై అసహనం వ్యక్తం చేసింది. ఉన్న ఫళంగా దిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో సీఎస్, డీజీపీ దిల్లీ వెళ్లి వివరణ ఇవ్వడం తెలిసింది. పల్నాడు జిల్లాల్లోని పోలీసుల నిర్లక్ష్యంపై నివేదిక పరిశీలించిన ఈసీ అప్పటికప్పుడు చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ బిందుమాధవ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. నరసరావుపేట, గురజాల డీఎస్పీలు వర్మ, పల్లపురాజు, ఎస్బీ సీఐలు ప్రభాకర్‌రావు, బాలనాగిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా కారంపూడి ఎస్‌ఐ రామాంజనేయులు, నాగార్జుసాగర్ ఎస్‌ఐ కొండారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఏపీ ఊపిరి పీల్చుకో - పల్నాడులో తీరం దాటిన రాజకీయ తుపాను ! - AP Elections 2024
భారీ స్థాయిలో బాంబులు, మారణాయుధాలు : అధికార పార్టీ నేతలు పల్నాడులో భారీ అల్లర్లకు కుట్ర పన్నినట్లు పోలీస్ శాఖ నిర్ధారించింది. పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో పాటు ఎన్నికల ఫలితాలు వెల్లడించాక తీవ్ర స్థాయిలో విధ్వంసానికి కుట్ర చేస్తున్నారని తేల్చింది. ఇప్పటికే అధికార పార్టీ నేతల ఇళ్లలో పెట్రో బాంబులు, మారణాయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకుంది. పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడితే మరిన్ని నాటు బాంబులు దొరికే అవకాశాలున్నాయి. నియోజకవర్గంలోని మాచవరం మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామమైన పిన్నెల్లిలో పోలీసులు తనిఖీలు చేశారు. అధికార పార్టీ నేత, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు చింతపల్లి చిన మస్తాన్‌వలీ అలియాస్ నన్నే, ఆ పార్టీ నాయకులు చింతపల్లి పెదసైదా, అల్లాభక్షు ఇళ్లల్లో 51 పెట్రో బాంబులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసికున్నారు. ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోనూ పెట్రో బాంబులు దొరికాయి. షేక్ గుంటూరు సైదా ఇంట్లోని బాత్రూమ్‌లో 29 పెట్రో బాంబులు లభించాయి. మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి సమీపంలోని ఓ వాహనంలో రాళ్లు, ఖాళీ బీరు సీసాల బస్తాలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నాటు బాంబులు, పెట్రోల్ సీసాల దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu