MP Election Nomination in Telangana : రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకుంది. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి ఖమ్మం కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు సమక్షంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని, దేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
కరీంనగర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్‌రెడ్డితో కలిసి కలెక్టరేట్‌కు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి టవర్ సర్కిల్ వరకూ భారీ రోడ్‌షో నిర్వహించారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లిలో గడ్డం వెంకటస్వామి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
Elections Nominations Completed in Telangana : నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నామినేషన్‌లో పాల్గొన్నారు. బీజేపీకి గుజరాత్‌లో ఒకస్థానం ఏకగ్రీవమైందని, ఇంకా 399 సీట్లే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పుష్కర్‌సింగ్ థామి పేర్కొన్నారు.
మెదక్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. అనంతరం ధ్యాన్ చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన : పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించి దిల్లీకి పంపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగియడంతో అధికారులు రేపటి నుంచి వాటిని పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంది. మే 13న కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ - BJP LEADER BANDI SANJAY NOMINATION