Ysrcp Leaders in Jail : అంబేడ్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేశారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు పాతరేశారు. పోలీస్ స్టేషన్లు అడ్డాగా అక్రమాలు, అరాచకాలకు తెరలేపారు. ప్రతిపక్ష నేతలు, పత్రికా కార్యాలయాలపై దాడులకు బరితెగించారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన తంతు ఇది. అధికార మత్తులో అహంకారంతో చెలరేగిన నేతలు నేడు అథపాతాళానికి పడిపోయి "రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు" అనే విషయాన్ని రుజువు చేస్తున్నారు. పరారీలో కొందరు, ముందస్తు బెయిళ్ల కోసం మరికొందరు, జైళ్లలో ఇంకొందరు, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ఎందరో.. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య.. అధినేత మెప్పు కోసం అరాచకాలు సాగించిన ఆ పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా జైలుకు క్యూ కడుతున్నారు. కాలం ఎవ్వరినీ వదలదు. అందరికీ అన్నీ ఇస్తుంది. అప్పుడప్పుడూ కొంచెం ఆలస్యమవుతుందేమో గానీ ఎవరికి దక్కాల్సింది వారికి అందుతుంది అనేది బాధిత వర్గాల మాట.
"చంద్రబాబునాయుడు నీకు టికెట్ ఇస్తాడా? నువ్వు గెలుస్తావా? గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా?" అంటూ అప్పట్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై కోటంరెడ్డిపై చెలరేగి మాట్లాడిన బోరుగడ్డ అనిల్ ఇప్పుడు రాజమహేంద్రవరం జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. "నోరు జాగ్రత్త.. మా నాయకుడు జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికి వస్తే బండికి కట్టి లాక్కుపోతా.. డేట్ ఫిక్స్ చేసుకో" అంటూ చేసిన బెదిరింపులు గుర్తు తెచ్చుకుని బోరున విలపిస్తున్నాడు.
"బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి" అనడానికి మాజీ ఎంపీ నందిగం సురేశ్ చక్కని ఉదాహరణ. వైఎస్సార్సీపీ హయాంలో తుళ్లూరు పోలీసుస్టేషన్ అడ్డాగా చెలరేగిపోయిన సురేశ్.. ఇప్పుడు అదే స్టేషన్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బీజేపీ నేతల కాన్వాయ్‌ను అడ్డగించి చేసిన దాడిలో నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ నిందితులు. వెలగపూడిలో జరిగిన మహిళ హత్య కేసులో నందిగం సురేష్, డబ్బుల కోసం బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ జైలు పాలయ్యారు.
వందలాది కార్యకర్తలను రెచ్చగొట్టి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఏ1 నిందితుడు పానుగంటి చైతన్యకు సైతం తత్వం బోధపడింది. తాడేపల్లి ఆఫీసులో సమావేశమైన పెద్దలు దాడికి రెచ్చగొట్టారని పోలీసు కస్టడీలో వెల్లడించిన చైతన్య నేడు రిమాండ్ ఖైదీగా గుంటూరు జైలులో గడుపుతున్నాడు.
"చర్యకు ప్రతిచర్య, మంచికి మంచి, చెడుకు చెడు" ఇది కర్మ సిద్ధాంతం సారాంశం. అధికారం మత్తులో అహంకారంతో విర్రవీగిన వైఎస్సార్సీపీ నేతలకు కర్మ ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ఒక్కొక్కరుగా జైళ్లకు వెళ్తున్న తీరు ఆ పార్టీ పెద్దలకు సైతం దడ పుట్టిస్తోంది.
'గుర్తులేదు, మర్చిపోయా' - సీఐడీ విచారణలో చైతన్య సమాధానాలు!