Leaders Resigning from YCP and Joining TDP: రాష్ట్రంలో ఎన్నికల వేళ అధికార వైసీపీలో అలజడి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు ఎవరో ఒకరు రాజీనామా చేయడం లేదా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తున్నారు. ఇక కింది స్థాయిలో ఈ పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. రాజీనామా చేసిన నేతలు టీడీపీ కండువా కప్పుకుంటున్నారు.
YSRCP Leaders Resigned Against Minister Roja in Nagiri: చిత్తూరు జిల్లా నగిరిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం రోజాకు టికెట్ కేటాయించడాన్నినిరసిస్తూ శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ చక్రపాణి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను తిరుపతిలో పార్టీ కార్యాలయంలో అందజేశారు. వైసీపీకి రాజీనామా చేసిన నేతలు తిరుపతిలో నిర్వహించిన మీడియా సమమావేశంలో మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి సముచిత స్థానం ఇవ్వలేదని ఆరోపించారు.
ఎన్నికల్లో రోజాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు రోజా చేసిన అవినీతిపై కాణిపాకంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు. ఎపీఐఐసీ భూముల్లో అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వడమాలపేట టోల్గేట్ వద్ద స్థలాలను రోజా కబ్జా చేయడాన్ని ప్రశ్నించానని ఆయన తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్లోను మంత్రి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. రోజాను నగరి నుంచి తరిమేయకుంటే ప్రజలు ప్రశాంతంగా బతికే అవకాశం లేదన్నారు. ఈ క్రమంలో వారు త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.
YCP Leaders Resigned in Guntur District: గుంటూరు జిల్లా తాడికొండలోనూ అధకార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తాడికొండ జడ్పీటీసీ జ్యోతి, ఆమె భర్త వీర్లంకయ్య వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత తెనాలి శ్రావణ్ కుమార్ ఇద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో అవమానాలు భరించలేకే టీడీపీలో చేరామని జడ్పీటీసీ జ్యోతి తెలిపారు. వైసీపీ నేతల మట్టితవ్వకాలు అడ్డుకుంటే దాడిచేశారని దీని గురించి పార్టీ పెద్దలకు చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్న వీర్లంకయ్య వాపోయారు.