KTR Tweet on Medigadda barrage Repair : కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని మరోమారు తేలిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ ఆనకట్ట పరిణామాలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం కట్టి, మరమ్మతులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మరమ్మతులు చేయాలని ఇంజినీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత కట్టేందుకు ఎల్ అండ్ టీ కంపెనీ ముందుకొచ్చిందని మాజీ మంత్రి గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని కేటీఆర్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఒకే ఒక ఎజెండాతో కాఫర్ డ్యాం కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికల్లో లాభం కోసమేనా అని కేటీఆర్ కాంగ్రెస్‌ను నిలదీశారు.
కోపం ఉంటే మాపై తీర్చుకోండి : మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని కేటీఆర్ గతంలోనూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కామధేనువు వంటి కాళేశ్వరాన్ని ప్రభుత్వం కాపాడుకోవాలని సూచించారు. మేడిగడ్డలో కుంగిన పియర్లను సరిచేయకుండా రేవంత్ సర్కార్ జాప్యం చేస్తోందన్న మాజీ మంత్రి, కేసీఆర్‌పై కోపంతో మొత్తం కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే బీఆర్ఎస్తో చూసుకోవాలని, అంతేకానీ రైతుల మీద, రాష్ట్రం మీద పగ తీర్చుకోవద్దని హితవు పలికారు.
మేడిగడ్డపై దుష్ప్రచారాన్ని ఆపి - వర్షాకాలంలోపు మరమ్మతులు చేపట్టండి : బీఆర్ఎస్
ఇదిలా ఉండగా, ఈ వర్షాకాలపు నీటిని నిల్వ చేసేందుకు వీలుగా దెబ్బతిన్న కాళేశ్వరం ఆనకట్టలకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గుత్తేదారు సంస్థలకు సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసి వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడంపై వారం రోజుల క్రితం ఈఎన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్‌కు షీట్ పైల్స్ వేసి గ్రౌటింగ్ చేయాలని, రాఫ్ట్ కింద గుంతలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించుకొని చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు గుత్తేదారు సంస్థను కోరినట్లు తెలిసింది.
అది తేలాకే పనులపై ముందుకు : పంపుహౌస్‌లు మళ్లీ మునగకుండా ఏం చేయాలన్న దానిపైనా భేటీలో చర్చించినట్లు తెలిసింది. ఆనకట్టల దిగువన నీటి వేగానికి తగ్గట్టుగా చర్యల విషయంలో డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫారసుల ఆధారంగా శాస్త్రీయంగా పనులు చేపట్టాలని కొందరు సూచించినట్లు తెలిసింది. అయితే ఏయే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది, ఎంత వ్యయమవుతుంది, దాన్ని ఎవరు భరించాలనేది తేలకుండా ప్రస్తుతం ముందుకెళ్లే అవకాశం లేదని సమాచారం.
కాళేశ్వరం ఆనకట్టలకు తాత్కాలిక మరమ్మతులు - గుత్తేదారు సంస్థలకు నీటిపారుదల శాఖ సూచన