KTR Tweet on Telangana Power Cut Issues : ప్రాథమిక సమస్యలు సైతం పరిష్కరించలేని అవివేకులు ప్రజలు ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురిచేస్తారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. పవర్ కట్ విషయమై ఫిర్యాదు చేస్తే ఇంటికి వచ్చి పోస్ట్ తీసివేయించారని ఓ వ్యక్తి ఎక్స్‌లో పేర్కొన్నారు. నెటిజన్ పోస్టుపై స్పందించిన కేటీఆర్, అతనికి మద్దతుగా ఉంటామని తెలిపారు. మెరుగైన సేవల కోసం ప్రశ్నించే వారిని ఇంధనశాఖ, టీజీఎస్పీడీఎల్ బెదిరించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన మార్పు ఇదేనా అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
KTR Tweet on Regional Party Power in Central : బలమైన ప్రాంతీయ పార్టీలకు తగిన ఎంపీ సీట్లు ఇచ్చినపుడు కేంద్రం నుంచి డిమాండ్లు సాధించుకోవచ్చని బీఆర్‌ఎస్ సీనియర్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బిహార్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్థికసాయం విషయమై ఎక్స్‌లో ఓ పోస్టుపై కేటీఆర్ స్పందించారు. కేంద్రం నిధుల విడుదల సోదర రాష్ట్రం ఏపీతో పాటు బిహార్ ప్రజలకు ఎంతో సంతోషకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Ex Minister Jagadish Reddy on Electricity : రాష్ట్రంలో కరెంట్ కోతలు, కొనుగోలు అంశం రోజురోజుకూ మరింత కలవరపెడుతోంది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ వివాదంపై మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఛత్తీస్‌గడ్ ఒప్పందంతో రూ.6వేల కోట్ల నష్టం జరిగిందన్న అంశాన్ని ఖండించారు. ఆ ఒప్పందంతో రాష్ట్రానికి అంతకు మించి లాభం జరిగిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో ప్రస్తుత ప్రభుత్వం విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారని విమర్శించారు.
గత ప్రభుత్వ దూరదృష్టితోనే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అభివృద్ధికి పనులు సాగుతున్నాయని చెప్పకొచ్చారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరిగిందని, ఆ ఒప్పందం లేకపోయి ఉంటే విద్యుత్ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఉత్తర భారతం నుంచి కరెంటు తీసుకోకుండా కేసీఆర్ ఫెయిల్ అయితే మళ్లీ సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు.