KTR Fires on Governor Tamilisai : గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యులు కానీ, రేవంత్ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన, గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణను తమ ప్రభుత్వం నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వన్ని తిరస్కరించారని కేటీఆర్ ఆక్షేపించారు. కానీ ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాం పేరు ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే, ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలని డిమాండ్ చేశారు.
KTR Reaction on Governor Quota MLCs : రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పని చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. నాడు కనిపించిన రాజకీయ నేపథ్యానికి ఉన్న అభ్యంతరాలు, ఇవాళ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా అన్న విషయాన్ని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును తెలుపుతోందని అన్నారు. ఈ క్రమంలోనే సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన ఎన్నికైన సర్పంచ్ ల పదవీ కాలాన్ని పొడిగించాలి కానీ, పర్సన్ ఇన్ఛార్జ్లను పెట్టొద్దని అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేయాలి కానీ, ప్రభుత్వం నియమించిన పర్సన్ ఇన్ఛార్జ్లు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
45 రోజుల పాలనలో దిల్లీ పర్యటనలు మినహా సీఎం రేవంత్ సాధించింది ఏమీ లేదు : కేటీఆర్
సర్పంచుల పదవీ కాలం పొడిగించాలి : రెండేళ్ల పాటు కరోనా సమయంలో పరిపాలనా సమయం పోయిందని, పదవీకాలాన్ని ఆర్నెళ్లు లేదా ఎన్నికలు నిర్వహించే వరకు పొడిగించాలని కేటీఆర్ కోరారు. కేవలం మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో లేరని సర్పంచులు పూర్తి చేసిన కార్యక్రమాల ప్రారంభాన్ని కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారన్న ఆయన, ఇంకా అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంచి పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన నీచమానవులు తమ బుద్ధి మారరని అప్పుడే చెప్పారని సుమతి శతకంలోని పద్యాన్ని ప్రస్తావించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంతో కాంగ్రెస్, బీజేపీ మైత్రి బట్టబయలైంది : హరీశ్‌రావు
ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం : రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు, ఇలాంటి విమర్శలు తప్పవని కేటీఆర్ అన్నారు. చేతనైతే ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని, ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రతి హామీ అమలు చేసే దాకా వెంటాడుతామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు ప్రజలందరికీ తెలుస్తోందన్న ఆయన, రేవంత్‌రెడ్డి పోయి అమిత్ షాను కలవగానే ఒకే ఎన్నిక కాకుండా వేరుగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధమని, మొన్న బండి సంజయ్, నిన్న గుంపు మేస్త్రీ కూడా ఇదే మాట చెప్పారని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్