KTR Tweet on Attack in BRS Leaders : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మంగళవారం రోజు (మే 14వ తేదీ) బీఆర్ఎస్ నేతలపై, వారి ఇండ్లపై కాంగ్రెస్ నాయకుల దాడులను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖంజింతాపు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌పై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు. హస్తం పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు.
KTR Comments on Rahul Gandhi : ఈ దాడులు, దుర్భాషలాడటంలో పోలీసులు కూడా భాగస్వామ్యం కావడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు. దాడులకు పాల్పడిన గూండాలు, ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలపై ఈ దాడులు సాధారణమైపోయాయని ఆరోపించారు.
RS Praveen Kumar COndemns Attack On Achampet BRS Leaders : మరోవైపు ఈ దాడి ఘటనను నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఖండించారు. కాంగ్రెస్ శ్రేణులు గులాబీ పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆరోపించారు. వారు యథేచ్చగా తమ వారిపై హత్యాయత్నం చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.
ఇదే విషయమై డీఎస్పీతో మాట్లాడితే నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని చెబుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పోలీసులు కనీసం ఒక్క నిందితుణ్ని కూడా పోలీస్‌స్టేషన్‌కు తీసుకరాలేకపోయారా అని ప్రశ్నించారు. అలాగే వాళ్ల మీద వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యేను తీసుకొచ్చి ఠాణాలో ప్రశ్నించాలని, అలాగైతే నిందితులు రెండు నిమిషాల్లో దొరుకుతారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అసలేం జరిగిదంటే : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అచ్చంపేటలో సోమవారం మొదలైన వివాదం రాజకీయంగా దాడులకు తెరలేపింది. ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా పురపాలిక పరిధిలోని సాయినగర్ కాలనీ 89వ పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులకు స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఇదే విషయమై మంగళవారం సాయంత్రం పట్టణంలోని సాయినగర్ కాలనీకి చెందిన గులాబీ పార్టీ కౌన్సిలర్ సుంకరి నిర్మల ఇంటి వద్ద వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే కొందరు కాంగ్రెస్ శ్రేణులు కౌన్సిలర్ సుంకరి నిర్మల ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి పోలీసుల ఎదుటే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా సామగ్రి కుర్చీలు, తలుపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
‘బేటీ బచావో’ నమునా ఇదేనా - బీజేపీపై కేటీఆర్ ట్వీట్ వార్! - KTR Tweet on PM Modi