KTR Comments On Pocharam Srinivas Reddy : బాన్సువాడ ఉపఎన్నికల్లో సిట్టింగ్ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డిని కచ్చితంగా ఓడిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో సమావేశం జరిగింది. గులాబీ జెండా మీద గెలిచిన పోచారం పార్టీ వీడినా కార్యకర్తలంతా బీఆర్ఎస్తోనే ఉన్నారని నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌తో తెలిపారు.
కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు : పోచారం పార్టీ మారడంతో నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం ఏంటో చూపిస్తామని బాన్సువాడ బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు. కేటీఆర్‌ను నియోజకవర్గానికి ఆహ్వానించినట్లు తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే తమకు ఇన్ని బాధలు ఉండకపోవని ప్రజలు అంటున్నారని, తాము పార్టీకి అండగా ఉంటామని, మళ్లీ కేసీఆర్ వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
పోచారంకు ప్రజలే బుద్ధి చెబుతారు : అభివృద్ధి కోసం పార్టీ మారానంటున్న పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ చేసింది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను పోచారం మోసం చేశారని వారు తెలిపారు. మొదట్నుంచీ పార్టీలో ఉన్న తామంతా అలాగే ఉన్నామని, మధ్యలో వచ్చి వెళ్లిన వారితో నష్టం లేదని వ్యాఖ్యానించారు. బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమన్న కేటీఆర్, పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని తెలిపారు.
అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం పోచారంకే నష్టమని, కార్యకర్తల కష్టం మీద గెలిచి, ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించిందని అన్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్ద వారైనా వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్, కార్యకర్తలు కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని కనీసం అడిగే వారు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
KTR Comments On CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి పాలనా సమర్థత ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని, మార్పు పేరుతో జనాన్ని ఏమారుస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. త్వరలోనే ప్రశాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు సహా తాను బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ, కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదని, బీఆర్ఎస్కు వారే కొండంత అండ అని అన్నారు. పార్టీ మారిన వ్యక్తులకు ఉపఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.