KTR Comments on Congress Guarantees : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వంద రోజుల్లో అమలుకాకపోతే ఆ పార్టీని బొంద పెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఇంటికి ఒక్కరికే అని అంటున్నారని మండిపడ్డారు. 18 ఏళ్లు నిండిన మహిళలు 1 కోటి 67 లక్షల మంది ఉన్నారని, వారందరికీ మహాలక్ష్మి పథకం వర్తించాలని డిమాండ్ చేశారు. ఇవాళ తుర్కయంజాల్ మున్సిపాలటీ పరిధి మన్నెగూడలోని ఓ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ నగర ప్రజలు తెలివిగా ఆలోచించి కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇవ్వకుండా 16 సీట్లు బీఆర్ఎస్కే కట్టబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ నగరానికి పక్కనే ఉన్న నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి వారికి ఓట్లు వేశారని చెప్పారు. కేసీఆర్(KCR) గత పదేళ్లుగా కృష్ణా నదీ యాజమాన్య బాధ్యతలను కేఆర్ఎంబీకి వెళ్లకుండా కాపాడితే, ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి కృష్ణానదీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి పోయింది అధికారం మాత్రమేనని పోరాట పటిమ కాదని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
బీఆర్ఎస్(BRS) హయాంలో కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీ తీసుకొచ్చామని, దాని వల్ల సుమారు 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. గత ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ సీటు 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయామని, ఈసారి ఇక్కడ ఘన విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తామంతా కలిసి పార్టీ కోసం పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
KTR About Medigadda Project : ఇదికాగా మరోవైపు ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మేడిగడ్డ బ్యారేజీకు వెళ్తామని తెలంగాణ భవన్లో ఇవాళ కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని చెప్పారు. మార్చి 1వ తేదీ నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం ఉంటుందని, 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో చలో మేడిగడ్డ నిర్వహిస్తామని ప్రకటించారు. చలో మేడిగడ్డ కార్యక్రమంలో తొలి రోజు కాళేశ్వరం వెళ్తామని, విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామని తెలిపారు.
'హైదరాబాద్ ప్రజలు తెలివిగా ఆలోచించి నగరంలోని 16 సీట్లకు 16 సీట్లు మాకు కట్టబెట్టారు. కానీ కొన్ని నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మాయలో పడి, ఆరు గ్యారెంటీల ఉచిత బస్సు అని, కేసీఆర్ ఇస్తున్న పథకాలు వస్తున్నాయిలే అని అనుకున్నారు.' - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు.
హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీశ్‌రావు
ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీల అమలు - బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు : సీఎం రేవంత్