KTR Comments on CM Revanth : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని, ఇక్కడ హామీలు అమలయ్యేది లేదని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర హక్కులు సాధించాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ను గెలిపించాలని కేటీఆర్ అన్నారు. ఇవాళ ఘట్‌కేసర్ మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - హస్తం పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్న గులాబీ నేతలు
KTR Fire on Congress : 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని, రెండు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే (డిసెంబర్ 9న) రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారని, రెండు నెలలు గడుస్తున్నా రైతుల రుణమాఫీ మాత్రం జరగలేదని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
'రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని, అందుకు మాకే ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లేకపోతే ఇవి చెయ్యమంటూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్నారు. వాళ్లు కేంద్రంలో వచ్చేది లేదు. గతంలో వచ్చిన 50 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇవాళ కేంద్రంలో నిజంగా బీజేపీకి ఆపగలిగే సత్తా ఎవరికైనా ఉందంటే, అది బలమైన ప్రాంతీయ పార్టీ నాయకులు కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి వారు మాత్రమే.':-కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
KTR on BJP : రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలుసన్నారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి, ఆరున్నర లక్షల మంది రోడ్డున పడ్డారని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సైతం చెక్ పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కృష్ణా జలాల్లో కేంద్రం, రాష్ట్రం వాటా తేల్చలేదని, కేఆర్‌ఎంబీకి(KRMB) మన కృష్ణా జలాలను తాకట్టు పెట్టారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఫుల్ ఫైర్ - సందీప్‌రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్
BRS Target on Parliament Elections : తెలంగాణ మాట దిల్లీలో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. మన బాస్‌లు దిల్లీ, గుజరాత్లో లేరని, ఎవరికి అన్యాయం జరిగిన అందరం బస్సు వేసుకొని మరీ వస్తామన్నారు. సీఎం రేవంత్ లాంటి వాళ్లను చాలా మందిని చూశామన్న కేటీఆర్, ఎంతో మంది తీస్మార్ ఖాన్‌లను మాయం చేసి కేసీఆర్(KCR) తెలంగాణ తెచ్చారని పేర్కొన్నారు.
లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారని కేటీఆర్ దుయ్యబట్టారు. సెక్రటేరియట్లో కంప్యూటర్లు, పేపర్లు ఉంటాయి కానీ లంకె బిందెలు ఉండవని ఎద్దేవా చేశారు. ప్రజల తరఫున, ప్రతి హామీని వారు నెరవేర్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చిన గులాబీ జెండాకు ఓటు వేస్తేనే మన గొంతుక ఉంటుందని, ప్రజలకు పిలుపునిచ్చారు.