Kishan Reddy on the Phone Tapping Case in Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసు అంత ఆషామాషీ కాదని, మాజీ సీఎం కేసీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నైతిక విలువలు లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందని, ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలో సిగ్గు లేకుండా మంత్రి పదవులు అనుభవించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను(Party Defections in Telangana) ఎజెండాగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి వేరే ఎజెండా లేదని, పార్టీ ఫిరాయింపులే ఎజెండాగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని వీడిన వారినీ కుక్కలు, నక్కలతో పోల్చారు, మరి ఆ కుక్కలను, నక్కలను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎట్లా చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారడం సమంజసం కాదని హితవు పలికారు.
Kishan Reddy Fires on KCR : అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంలో సీనియర్ పోలీసు అధికారులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అంత ఆషామాషీ కాదని చాలా తీవ్రమైందన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసిన ట్యాపింగే కాదు వ్యక్తిగత గోప్యత, గౌరవం, నియమాల ఉల్లంఘన జరిగిందని ఆవేదన చెందారు.
2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ సర్కారు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 2020 అక్టోబరులో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. పోలీసు నివేదికలో సైతం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బయటకు వస్తున్నాయన్నారు.
హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసి - ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్!
ఫోన్ ట్యాపింగ్‌కు కారణం ఎవరు కేసీఆర్? : ఈ ఫోన్ ట్యాపింగ్‌కి కారణం ఎవరనీ కేసీఆర్‌ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ను కోరుతున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారని కిషన్ రెడ్డి తెలిపారు. ఒకటి, రెండు ఫోన్లు ట్యాపింగ్‌లు జరగొచ్చు అన్న కేటీఆర్ ఇప్పుడు తనకేమీ సంబంధం అంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం బీఆర్ఎస్(BRS) గుర్తింపుపై పునరాలోచించాలని కోరారు. ఈ కేసును సుమోటోగా తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు.
Kishan Reddy Comments on Congress : వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఏమైందీ రేవంత్ రెడ్డికి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసిందనేది గుర్తు లేనట్లు ఉందన్నారు. ఇంకా వంద రోజులు పూర్తి కాలేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు నిలదీయాలన్నారు. ఈ రకంగా చూస్తే కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీలతో అధికారంలోకి రాలేదని ప్రమాదవశాత్తు వచ్చిందన్నారు.
కేఆర్ఎంబీ మీటింగ్‌కు వెళ్లకపోవడం పెద్ద నిర్లక్ష్యం : కేఆర్ఎంబీ మీటింగ్‌కు ఇరు రాష్ట్రాల అధికారులు రాకపోవడం అంటే ఇంతకంటే పెద్ద నిర్లక్ష్యం ఉండదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కరవు వస్తుంటే నీటి పంపకాల కంటే ప్రభుత్వానికి పెద్ద పని ఏం ఉందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ పార్టీ వదిలే ప్రయత్నం చేసిన బీజేపీ మాత్రం వదిలి పెట్టే ప్రసక్తి లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే చర్యలు తప్పవు - ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసు- రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీ