Kadiyam Srihari Allegation on BRS : తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసి, రాష్ట్ర వనరులను దోచుకుని కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణను నాశనం చేసింది మీరు కాదా? అని కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో కవిత రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడి ఇప్పుడు తీహాడ్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలు ప్రజల ముందు పెడతామని హెచ్చరించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పత్రిక సమావేశాలు పెట్టి బీజేపీకి ఓటేయాలని అడుగుతున్నారని, తెలంగాణలో ఆ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.
జూన్ 4 తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 మాసాలు కూడా కాలేదని, కేంద్రంలో బీజేపీ వచ్చి 10 సంవత్సరాలు అయినా తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని శ్రీహరి ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి ఏం చేశారని మండిపడ్డారు. బీజేపీ నేతలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని అన్నారని, కనీసం 20 లక్షల ఉద్యోగాలైన ఇచ్చారా? అని ప్రశ్నించారు. మళ్లీ ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ నిరుద్యోగ యువతను ఓటు అడుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారని తెలిపారు. తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
'ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీశ్‌రావు ఊరూవాడ తిరుగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇంతలా ప్రచారం చేయలేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఒక్కసారి కేటీఆర్, హరీశ్‌రావు ఆలోచించుకోవాలి. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసి రాష్ట్ర వనరులను దోచుకుని కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బాగుపడి రాష్ట్రాన్ని నాశనం చేసింది మీరు కాదా అని అడుగుతున్నా. కల్వకుంట్ల కవిత ఈరోజు లిక్కర్ స్కాంలో ఇరుక్కొని వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి తిహాడ్ జైల్లో ఉన్నారు. మీకు అవమానంగా లేదా అని అడుగుతున్నా'- కడియం శ్రీహరి, మాజీ మంత్రి
నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరాను : కడియం శ్రీహరి - Kadiyam Srihari Election Campaign