Janasena Petition In AP High Court : స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని జనసేన పార్టీ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. రెండోసారి కూడా ఎన్నికల అధికారికి వినతిపత్రం ఇచ్చినా ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మిగతా సీట్లలో తమతో పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్నాయని, ఆ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కోరామన్నారు. గాజు గ్లాసు గుర్తును స్వతంత్య్ర అభ్యర్థికి కేటాయించటం వల్ల కూటమికి నష్టం వస్తుందన్నారు. జనసేన ఇచ్చిన అభ్యర్ధనపై 24 గంటల్లో ఈసీ నిర్ణయం ఉంటుందని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఈ వ్యాజ్యంలో టీడీపీ సైతం వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది.
వేరే పార్టీకి గాజు గ్లాస్ గుర్తు: సీఈసీకి భాజపా-జనసేన ఫిర్యాదు
Janasena Glass Symbol To Independents : కాగా జనసేన పోటీలో లేని పలు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించింది.
ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైసీపీయే ఈ కుట్రకు తెర లేపిందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నచోట్ల, వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నచోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్ అభ్యర్థులకు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 50కు పైగా శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు, పలు చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఎన్నికల సంఘం కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్లో ధర్మానిదే విజయం - పొత్తుదే గెలుపు - కూటమిదే పీఠం : పవన్ కల్యాణ్
ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు - లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా : పవన్ కల్యాణ్