Jagan Comments On EVMs : ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడాన్ని మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రభుత్వం కూలిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని భరించలేకపోతున్నారు. గెలిస్తే తన వల్లేనని గొప్పలు చెప్పుకొనే జగన్ ఓటమి నెపాన్ని ఓసారి ఓటర్ల వైపు, ఈసారి ఈవీఎంలపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిపై అదేరోజు మీడియాతో మాట్లాడిన జగన్ తమను జనం నమ్మలేదని, పథకాలు తీసుకుని వమ్ముచేశారని వారిపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు.
తాజాగా ఈవీఎం యంత్రాలపైనా ఎక్స్(X)వేదికగా జగన్ అక్కసు వెళ్లగక్కారు. గతం మరిచి నీతులు వల్లెవేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే? "న్యాయం అందడమే కాదు.. అందజేసినట్లు కూడా కనిపించాలి, ప్రజాస్వామ్యం కూడా నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలి.. పేపర్ బ్యాలెట్ ఓటు పారదర్శకతను పెంచుతుందని, ప్రజల్లో విశ్వాసం నింపుతుంది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ వాడకం ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటుతుంది, పౌరుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది" అని పేర్కొన్నారు.
ఇదే జగన్ అంతకుముందు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివీ.. "80 శాతం ఓటర్లు పోలింగ్ బూత్‌లో బటన్ నొక్కారు. వాళ్లు ఎవరికి ఓటు వేశారో వీవీ ప్యాట్‌లో కూడా కనిపించింది. రెండూ మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఓటు వేసిన వాళ్లంతా సాటిస్ఫై అయ్యారు. 80శాతం ఓటర్లలో ఏ ఒక్క ఓటరూ కంప్లయింట్ ఇవ్వలేదు. నేను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వీవీ ప్యాట్‌లో సైకిల్ గుర్తు కనిపిస్తే నేనెందుకు గమ్మునుంటా? గమ్మునుండను కదా! అక్కడే బూత్‌లోనే గొడవ చేసి ఉండేవాడిని. కంప్లయింట్ ఇచ్చే వాడిని. ఏ పార్టీ వాడైనా ఓటేసిన తర్వాత వేరే పార్టీకి పడుతున్నట్లుగా ఎవరికీ కనిపించలేదు కాబట్టే 80శాతం మంది జనాభా ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యారు. ఎటువంటివి ఎక్కడా జరగలేదు."
జగన్ ట్వీట్‌పై టీడీపీ నేతలు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. జగన్‌కు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానిరి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉపఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదాం అని బుద్ధా పేర్కొన్నారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆత్మ స్తుతి పర నింద మాని ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు.
ఎట్టకేలకు తొలగిన ఆంక్షలు- తాడేపల్లి పరిసర ప్రజల్లో ఆనందోత్సాహాలు - Tadepalli Palace Road
"అదేంటి, ఇక్కడ ఎందుకు ఉంది?"- మనుషులు, వస్తువులనూ నమ్మని మాజీ సీఎం - Ex CM YS Jagan 5 Years Ruling