Jagan Met Pinnelli Rama Krishna Reddy : ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసు సహా మరికొన్ని కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్సార్సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. నెల్లూరు జైలుకు వెళ్లి ములాఖత్‌లో ఆయన్ను కలిశారు. ఆయనకు కనీసం ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ జైలుకు వెళ్లి మరీ కలవడం చర్చనీయాంశవుతోంది.
అక్రమంగా కటకటాల్లోకి నెట్టారంటూ ఆవేదన : నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ తన ఆవేదనను సన్నిహితుల వద్ద వెలిబుచ్చారు. పిన్నెల్లిని అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం మంచివాళ్లైన తమ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతోందని అన్నారు. పిన్నెల్లిని అరెస్టుపై ఆయన తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. జైలు వద్దకు జగన్ రాకతో పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పోలీసులు వారిస్తున్న వినకుండా భారీగా జైలు వద్ద గుమిగూడారు. జగన్ రాకతో పోలీసులు జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Public Opinion On YS Jagan : ఇది ఇలా ఉండే, జగన్ మాటలు విన్న ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పిన జగన్ తన తీరును మార్చుకోలేదని అంటున్నారు. పిన్నెల్లిని మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, ఇతర కేసులో అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిన్నెల్లి స్వయంగా ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో దేశమంతటా షికారు చేసిన తరువాత కూడా ఆయన ఇలా మాట్లాడడంపై ప్రతి ఒక్కురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిప్పులు చేరిగిన విషయం తెలిసిందే. కానీ జగన్‌పై మాత్రం పలు కేసుల్లో పిన్నెల్లిని అక్రమంగా కటకటాల్లోకి నెట్టారంటూ లబోదిబోమనడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అసలేం జరిగింది : మే 13న జరిగిన ఎన్నికల్లో మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుకు వేలు చూపిస్తూ 'నీ అంతు చూస్తా బయటకు రా' అని బెదిరించారు. తర్వాత ఆయన అనుచరులు శేషగిరిరావుపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ప్రశ్నించబోయిన మరో మహిళను 'ఏయ్ జాగ్రత్త' అంటూ పిన్నెల్లి దుర్భాషలాడారు. పదుల సంఖ్యలో అనుచరులను వెంటబెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు.
మరోవైపు డ్యూటీలో ఉన్న కారంపూడి సీఐపై దాడి చేశారు. వీటన్నింటికీ కూడా సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజీలు సాక్ష్యాధారాలుగా ఉన్నాయి. దీంతో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయనకు కనీసం ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ జైలుకు వెళ్లి మరీ కలవడం చర్చనీయాంశవుతోంది.
హెలికాప్టర్లో చేరుకున్న జగన్ : తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు రూరల్ ప్రాంతంలోని కనపర్తిపాడు వద్దకు చేరుకున్న జగన్, అక్కడి నుంచి రోడ్డు మార్గాన జైలుకు చేరుకున్నారు. జగన్‌తో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుతో పాటు ముఖ్య నేతలు జైలు వద్దకు వచ్చారు. జగన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి రావడంతో జైలు వద్ద హడావిడి నెలకొంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికెట్లను సైతం తోసుకుని వైసీపీ శ్రేణులు జైలు గేటు వద్దకు వచ్చేశారు. అనంతరం పిన్నెల్లిని జైల్లో పరామర్శించిన జగన్ తిరిగి తాడేపల్లికి బయలుదేరారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్‌జైలుకు తరలింపు
హత్యలు, అరాచకాలు, వేల కోట్ల ఆస్తులు - 'ఏపీ నయీమ్ పిన్నెల్లి'పై టీడీపీ బుక్