Vedadri Lift Scheme Works Stopped : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. 2020లో శంకుస్థాపన తర్వాత గుత్తేదారు సంస్థ 15 శాతం పనుల్ని చేపట్టి మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి జలవనరుల శాఖ గడువు పెంచుకుంటూ నోటీసులు అందిస్తుంది. తాజాగా ఈ ఏడాది డిసెంబరు వరకు పనుల గడువును పెంచుతూ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం గుత్తేదారుకు నిధులు విడుదల చేయకుండా ఉత్తుత్తి నోటీసులు ఇవ్వడంపై రైతులు, రైతుసంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివాహ వార్సికోత్సవం సందర్భంగా ఇచ్చిన గొప్ప బహుమతి అంటూ అతడి పెళ్లి రోజున వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఆగస్టు 28, 2020న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగ్గయ్యపేట నియోజకవర్గంలో నిర్మాణం చేసే ఎత్తిపోతల పథకానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కేవలం 14 నెలల్లోనే దీన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆనాడు ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలందరూ సెలవిచ్చారు. ఈ పథకానికి శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం వైఎస్ జగన్‌రెడ్డి దంపతులు వివాహ వార్షికోత్సవాన్ని మూడు సార్లు ఘనంగానే జరుపుకున్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎమ్మెల్యే మాకొద్దు: పలమనేరు ప్రజలు
జగ్గయ్యపేటలోని ఎత్తిపోతల పథకం శిలాఫలకం మాత్రం మసిబారిపోయింది. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. శంకుస్థాపన సందర్భంగా కేవలం 18నెలల్లోనే పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సరికదా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. ముక్త్యాల పథకానికి కాస్త వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకం అంటూ నామకరణం చేశారు. తన తండ్రి పేరు పెట్టినా ఒక్క రూపాయి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టు సంస్థ ఏకంగా పనులు వదిలేసింది. జలవనరుల శాఖ మాత్రం గడువు పెంచుకుంటూ ప్రతి ఆరు నెలలకు ఉత్తర్వులు జారీ చేస్తోంది.
'కళింగపట్నం' ఆగిపోయింది! - రైతన్నలకు కన్నీరు మిగిల్చిన వైఎస్సార్సీపీ
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేదాద్రి ఎత్తిపోతల పథకానికి పరిపాలన అనుమతులు వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఆ పథకానికే పేరు మార్చి తన తండ్రి పేరు పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా రైతులనే ఏమార్చారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలకు సాగునీరు అందించే ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం 2019లోనే చేపట్టింది. అదే పథకానికి పేరు మార్చి, స్థలం మార్చి మళ్లీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అదీ తన పెళ్లిరోజు సందర్భంగా ఈ బహుమతి ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. నిధులు ఇవ్వకపోవడంతో గుత్త సంస్థ పనులు నిలిపివేసింది. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో 38,627 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రూపకల్పన చేసిన ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం మారడంతో 25శాతం లోపు ఉన్న అన్ని పనులను రద్దు చేశారు. దీనిలో భాగంగా ముక్త్యాల ఎత్తిపోతల పథకం రద్దయ్యింది.
"వరికపూడిశెల ఎత్తిపోతలకు జగన్ ఉత్తుత్తి శంకుస్థాపన"
అదే డీపీఆర్ (DPR) అదేఎత్తిపోతల పథకం.. పేరు, స్థలం మార్పు చేశారు. ముక్త్యాల సమీపంలో కృష్ణా నది (Krishna river)పై నిర్మాణం చేయాల్సిన దీన్ని వేదాద్రికి మార్చారు. పథకం పేరు వైఎస్సార్ వేదాద్రి. రూ.489.28కోట్లకు పరిపాలన అనుమతి రాగా 368కోట్ల రూపాయలకు సాంకేతిక అనుమతి లభించింది. దీన్ని 4.6శాతం అధిక ధరలకు మేఘా సంస్థ దక్కించుకుంది. కాంట్రాక్టు వ్యయం 312.19 కోట్లకు ఖరారు చేసింది. మొత్తం 386.27 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. 120 రోజులు పనిచేయాల్సి ఉండగా కాంట్రాక్టు సంస్థ వేదాద్రి వద్ద కృష్ణా నది ఒడ్డున పంపుహౌస్ నిర్మాణం చేపట్టింది. పునాదులు తీసి ఫైల్ పౌండేషన్ నిర్మాణం చేశారు. కాంక్రీట్ పనులు జరిగాయి. సుమారు రెండు కిలోమీటర్ల వరకు పైపులు నిర్మాణం చేశారు. ఈ ప్రాజెక్టుకు 51.72ఎకరాల పట్టాభూములు సేకరించాల్సి ఉంది. సుమారు రూ.50కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
ప్రభుత్వం ఆదుకోకుంటే వ్యవసాయం మానేయాల్సిందే - బతకడం కూడా కష్టమే : ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
కొంతకాలం వేచి చూసినా బిల్లులు రాకపోవడంతో సైట్ నుంచి యంత్రాలు తరలించారు. దాదాపు 15శాతం వరకు పనులు పూర్తి చేసిన సంస్థకు 3.28కోట్లు బిల్లులు మాత్రమే ఇచ్చారు. 28.58కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 51.72 ఎకరాలు పట్టాభూమి, 2.34 ఎకరాలు అటవీభూమి సేకరించాలి. దీనికి పరిహారం 15.33కోట్లు నిధులు కావాలని ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ (Collector) లేఖ రాశారు. ఈ నిధులూ రాలేదు. బిల్లులు మంజూరు కాలేదు. గుత్త సంస్థ పనులను వదులుకుంది. ఇప్పటివరకు చేసిన పనుల బిల్లులను వదిలేసుకుంది. జలవనరుల శాఖ అధికారులు మాత్రం ప్రతి ఆరు నెలలకు మొక్కుబడిగా గడువు పెంచుతోంది. తాజాగా 2024 డిసెంబరు వరకు గడువు పెంచింది. కానీ, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. ఇలా నోటీసులు పొడిగించడం తప్ప నిధుల విడుదలు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడటం సాగునీటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వ వైఖరిని చాటుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తే రెండు నియోజకవర్గాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరేవి. పథకం కేవలం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులు విడుదల చేస్తే వేదాద్రి ఎత్తిపోతల పథకం మళ్లీ పట్టాలెక్కే అవకాశముంది.
పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం - వేల ఎకరాల్లో బీళ్లుగా మారిన పంట పొలాలు