Farmers' debts increased during Jagan's regime : 'వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. జ్యూస్ ఫ్యాక్టరీలు తెరుస్తాం. వసతి గృహాల్లో టమోటా సాస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తాం. శీతల గోదాములు నిర్మిస్తాం' గత ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన గొప్పగొప్ప హామీలివీ. మరి అధికారంలో వచ్చాక ఈ ఐదేళ్లలో ఏం చేశారు? ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు శుద్ధ అబద్ధమని నిరూపించారు. జ్యూస్ ఫ్యాక్టరీ ఉత్తదేనని తేల్చేశారు. టమోటా సాస్ యంత్రాలను 'తుస్' అనిపించారు. గోదాముల నిర్మాణం మాటను గోదారిలో కలిపేశారు. మొత్తానికి ఉద్యాన రైతుల చెవుల్లో 'పువ్వులు' పెట్టారు. ఫలితంగా రాష్ట్రంలో ఉద్యాన సాగు ఉసూరుమంటోంది.
నకిలీ విత్తనాలతో 1000 ఎకరాల్లో పంట నష్టం- పరిహారం ఇవ్వాలంటూ రైతుల ఆందోళన
ప్రతి మండలానికి ఒక ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికలకు ముందు పండ్ల తోటల రైతులను జగన్ ఊరించారు. అధికారంలోకి వచ్చాక కనీసం నియోజకవర్గానికి ఒక్కటి కూడా అందుబాటులోకి తీసుకురాకపోగా ఉద్యాన శాఖలో అప్పటికే అమలవుతున్న పథకాలను నిలిపేసి, వాటికిచ్చే రాయితీలకు కోతపెట్టి రెండేళ్లపాటు రైతులను వేధించారు. లక్షల రూపాయలతో షేడ్ నెట్(Shade net), పాలీ హౌస్ (Polly House)లు, పందిరి సాగు చేపట్టిన రైతులకు రాయితీలు నిలిపేసి వేధించారు. అప్పులు చేసి మరీ ఏర్పాటు చేశామని, రాయితీ సొమ్ము చెల్లించాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, లక్షల మంది రైతులు అతలాకుతలమయ్యారు.
జగన్ హయాంలో అన్నదాతల అవస్థలు - ప్రభుత్వ నిర్వాకంతో ఏటికేడూ కాడి వదిలేస్తున్న రైతులు
రాయితీలు, కేంద్ర పథకాలకు వాటా నిధులు ఇవ్వకుండా, రైతులు అప్పుల పాలయ్యే విధానాలను జగన్ ప్రభుత్వం అవలంబించింది. కూరగాయలు సాగు చేసే రైతులకు గత ప్రభుత్వం ఎకరాకు 1,200 చొప్పున రాయితీ ఇవ్వగా వైఎస్సార్సీపీ పాలనలో ఈ రాయితీలకు మంగళం పాడారు. పండ్ల తోటల్లో కాయ నాణ్యత పెంచేందుకు వినియోగించే కవర్లనూ రాయితీపై ఇవ్వడం లేదీ ప్రభుత్వం. మల్చింగ్ (Mulching), ఇతర పథకాలకూ పాతరేసింది. దీంతో మామిడి సాగు విస్తీర్ణం గత ఐదేళ్లలో 7.5 లక్షల ఎకరాల నుంచి 6.55 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవడంతోనే, రైతులు సాగుకు విముఖత చూపుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మామిడికి బీమా కల్పించి, రైతులను ఆదుకోవడానికి కూడా జగన్‌కు మనసు రావడంలేదు. 2019 సంవత్సరం వరకు ఉన్న పంటల బీమాను 2020 నుంచి ఎత్తేశారు.
నీరిస్తామన్నారని వరి వేసిన అన్నదాతలు- పంట కోతకొచ్చే వేళ చేతులెత్తిన అధికారులు
రాయలసీమ ప్రాంతంలో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ఎన్నికల ముందు జగన్ ప్రగల్భాలు పలికారు. అధికార పీఠం ఎక్కాక మరచిపోయారు. మండలానికి ఒక టమాటా గుజ్జు పరిశ్రమ (Tomato pulp industry) ఏర్పాటు నెలకొల్పుతామని, రైతులను నష్టాల నుంచి గట్టెక్కిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికారు. నిబంధనల పేరుతో మిరప రైతులకు బీమాను ఎగవేసింది. కొన్ని జిల్లాల్లోనే అరకొర పరిహారంతో సరిపెట్టింది. కూరగాయల ఉత్పత్తి 86.61 లక్షల టన్నుల నుంచి 79 లక్షల టన్నులకు, మొత్తం పండ్ల ఉత్పత్తి కూడా 182 లక్షల టన్నుల నుంచి 176 లక్షల టన్నులకు దిగజారింది. టమోటా సాగులో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ జగన్ హయాంలో సాగు తగ్గడంతో తన ప్రాభవాన్ని కోల్పోయింది. మిరప, అరటి, బొప్పాయి, దానిమ్మ, జామ తదితర పంటలకు చీడపురుగులు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. అయినా ప్రభుత్వం రైతుల్ని ఆదుకున్న దాఖలాలే లేవు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు - ధ్వంసం చేసిన రైతన్నలు
తెలుగుదేశం హయాం రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు స్వర్ణయుగంగా నిలిచిందని రైతులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యమిచ్చింది. ఫలితంగా పండ్లు, పూలతోటలు, ఔషధ మొక్కలు, కూరగాయ పంటల సాగుకు రైతులు ఎక్కువ సంఖ్యలో ముందుకొచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గత ప్రభుత్వం ఉద్యాన రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు చేపట్టింది. పంట ఉత్పత్తుల కొనుగోలు, విదేశాలకు ఎగుమతికి ప్రాధాన్యం ఇచ్చింది. అరటి, మామిడి, కొబ్బరి, టమాటా తదితర పంటల్లో ఆధునిక సేద్య విధానాలను ప్రోత్సహించిన ప్రభుత్వం, రైతులు నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలన్న సంకల్పంతో మామిడి, దానిమ్మ కాయలకు కట్టే కవర్లను రాయితీపై అందించింది. నాడు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని 7.25 లక్షల మంది రైతులకు 18 లక్షల ఎకరాల్లో బిందు, సూక్ష్మ సేద్యం ప్రాజెక్టును అమలు చేసింది. 18 లక్షల చదరపు మీటర్ల షేడ్‌నెట్‌లు, పాలీహౌస్‌లు ఏర్పాటు చేసింది. ఎనిమిది వేల ఎకరాల్లో పందిరి సాగు, 30 వేల ఎకరాల్లో మల్చింగ్‌కు రాయితీలు ఇచ్చింది. ఈ క్రమంలోనే 3,068 ప్యాక్‌హౌస్‌లు, 240 రైపనింగ్ ఛాంబర్లు, 341 శీతల గోదాములతో పాటుగా 282 కొబ్బరి ప్యాక్‌హౌస్‌లు, 67 ఉల్లి నిల్వ యూనిట్లు, 380 జీడిమామిడి శుద్ధి పరిశ్రమలను రాయితీపై ఏర్పాటు చేయించింది. రాయితీపై ఏసీ వాహనాలను అందజేసింది.
కొవిడ్ సమయంలోనూ ఉద్యాన రైతులను వైఎస్సార్సీపీ సర్కారు ఆదుకోలేదు. క్వింటా అరటికి 800 రూపాయల మద్దతు ధరగా ప్రకటించిన ప్రభుత్వం రైతుల నుంచి మాత్రం క్వింటాకు 400 రూపాయల చొప్పున మాత్రమే కొనుగోలు చేసి వారిని నిండా ముంచేసింది.