Huge Joinings in TDP from YSRCP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు మెుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజు టీడీపీ గ్రాఫ్ పెరుగుతుండంతో.. వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. సారవకోటకు చెందిన వైసీపీ ఎంపీపీతో పాటుగా సుమారు రెండు వేల మంది ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. టీడీపీలో చేరిన వారికి శ్రీకాకుళం ఎంపీ కించరపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పార్టీ కండువా కప్పి ఆవ్వాానించారు. ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు ఆయన సోదరుడు రామ సత్యనారాయణ తో పాటు తొమ్మిది మంది ఎంపీటీసీలు పదిమంది సర్పంచులు టీడీపీలో చేరారు. వారితో పాటుగా ఆయా గ్రామాలకు చెందిన సుమారు 2000 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కలిగాం గ్రామ సర్పంచ్ సనపల కోటేశ్వర రావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటుగా సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కోటేశ్వరావు ఎమ్మెల్యే నియంతృత్వ వైఖరి వల్లే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు.
'సూపర్ సిక్స్' పథకాల ఆకర్షణ - పార్టీని వీడుతున్న వైసీపీ శ్రేణులు - YSRCP Leaders Join in TDP
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగలింది. సుమారు 8 వందల మంది వైసీపీ కార్యకర్తలు బీజేపీలో చేరారు. విజయవాడ పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నేత పోతిన కంఠేశ్వరుడు ఆధ్వర్యంలో మరో వంద మంది బీజేపీ గూటికి చేరారు.
కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో 80 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు అమిలినేని సురేంద్రబాబు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోనందుకున్నాయి. నల్లచెరువు మండలం కమ్మవారి పల్లి, ఎనుమలవారి పల్లి, పట్రవాండ్ల పల్లి, పులిమి వాండ్ల పల్లి, రాట్నాల పల్లి గ్రామాలకు చెందిన పలు కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వీరందరికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిదిలోని 8వ వార్డులో కూటమి అభ్యర్థి బుచ్చిబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తోడల్లుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు. బుచ్చిబాబు సమక్షంలో సుబ్రహ్మణ్యం పసుపు కండువా కప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతోపాటు గ్రామంలోని పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.