Harish Rao Sensational Comments On CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు. పరీక్షల వాయిదాపై సీఎం వ్యాఖ్యలు పరిణితి లేనివని ఆయన మండిపడ్డారు. రేవంత్ గతం మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. నాడు గ్రూప్-2, టెట్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు అభ్యర్థులు అడిగితే మద్దతు తెలపలేదా? అని హరీశ్ ప్రశ్నించారు.
Harish Rao Fires On CM Revanth : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్-2 పరీక్షలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదని హరీశ్ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి, నడి రోడ్డున పడేలా చేశారని హరీశ్ రావు ఆక్షేపించారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరితే, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
సీఎం స్థాయి వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేయడం తగదు : అభ్యర్థులు, నిరుద్యోగులపై ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యమని హరీశ్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతానికే విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అంటున్న రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజకీయం కోసమే వాయిదా కోరారా? అని ప్రశ్నించారు.
రెండు నాల్కల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు : రాత్రి, పగలు కూడా లెక్కచేయకుండా అభ్యర్థులు, పోరాటం చేస్తుంటే సానుభూతి చూపాల్సింది పోయి, రాజకీయ విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆక్షేపించారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, రెండు నాల్కల ధోరణిని ప్రజలందరూ గమనిస్తున్నారని తప్పక బుద్ధి చెబుతారని హరీశ్ రావు తెలిపారు.
అక్రమ కేసులు బనాయించడమేనా ప్రజాపాలన అంటే? : హరీశ్‌రావు - Harish Rao On Koushik Reddy Issue