Harish Rao on Paddy Bonus in Telangana : రాష్ట్రంలో యాసంగిలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని ఆ ధాన్యానికి రూ.500 బోనస్ లేదనటం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సన్నవడ్లకు బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితే రాదని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతుబంధు డబ్బులను జూన్ నెలలోనే వేయాలని డిమాండ్ చేశారు.
Harish Rao on Farmers Problems in Telangana : కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదని హరీశ్ రావు తెలిపారు. లారీ డ్రైవర్లు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జీలుగు, జనుము విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రైతుబంధు డబ్బులను జూన్ నెలలోనే వేయాలని డిమాండ్ చేశారు.
తడిసిన ధాన్యాన్ని మొలకలు రాకముందే కొనుగోలు చేసి తరలించాలని విజ్ఞప్తి చేశారు. రైసు మిల్లర్ల నుంచి కొనుగోలు చేసైనా సన్నబియ్యం ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులు దళారులకు వడ్లు అమ్ముకుంటున్నారని, ధాన్యం తడుస్తున్నా కొనుగోళ్లు చేయలేదని అన్నారు. రైతులు చెప్పులు క్యూలైన్లలో పెట్టాల్సిన పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఎద్దేవా చేశారు.
Harish Rao on Paddy Bonus Issue : వడ్లు కొనడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, రైతులు దళారులకు వడ్లు అమ్ముకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల హామీకి అనుగుణంగా అన్ని పంటలను కనీస మద్దతు ధర ఇవ్వాలని హరీశ్ రావు సూచించారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి విషయంలో మాట మార్చారని విమర్శించారు. రాబోయే రోజుల్లో పోరాటాన్ని ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. జూన్ నెలలోనే రైతుభరోసా చెల్లింపులు చేయాలని, బకాయిలతో కలిపి ఎకరాకు పదివేల చొప్పున డబ్బులు ఇవ్వాలని కోరారు.
"రైతు భరోసా ఇచ్చామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. మిగతా రూ.2500లు ఇవ్వాలి. సన్న వడ్లకు మాత్రమే ఇస్తే కేవలం రూ.500- రూ.600 కోట్లు మాత్రమే అవసరం అవుతుంది. రైతులకు రూ.5500 కోట్లు మొండి చేయి చూపుతున్నారు. రాష్ట్రంలో కోటీ 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి. 500 బోనస్ ఇస్తే 6000 కోట్లు అవసరమవుతుంది." - హరీశ్ రావు , మాజీ మంత్రి