Harish Rao Fires on Congress : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలని, ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం నేతలు తెలంగాణ భవన్‌లో(Telangana Bhavan) మాజీ మంత్రిని కలిసి లోక్‌సభ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఏ రోజూ కరెంట్ పోలేదన్న హరీశ్, కాంగ్రెస్ పాలన మెుదలైన మూడు నెలల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు.
రుణమాఫీ, రైతుబంధు, కరెంట్, బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై రానున్న లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. పదేళ్లలో ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నామన్న ఆయన, వంద రోజుల్లో 13 హామీలు, డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ అన్నారని పేర్కొన్నారు. ఎన్ని 9 తేదీలు మారినా రుణమాఫీ కావడం లేదని కాంగ్రెస్ పాలన అంటేనే దగా అన్నట్లు ఉందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు.
ఆడబిడ్డల ఉద్యోగాలు ఊడగొట్టి - రూ.500కే వంట గ్యాస్ అని ఇంట్లో కూర్చోబెడతారా? : కవిత
"కాంగ్రెస్ అధికారంలోకి మళ్లీ వచ్చింది. మళ్లీ మోటార్లు కాలిపోతున్నాయి. బోరుబావులు ఎండిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయి. మరోవైపు పంటలు ఎండుపోతున్నాయి. మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయని రైతులందరూ ఎంతో బాధపడుతూ చెప్తోన్న విషయాలను నా కళ్లతో నేను చూశాను. వంద రోజుల్లో మేము 13 హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. తొమ్మిదో తారీఖునాడే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ ఎన్ని తొమ్మిదిలు పోయినా, రుణమాఫీ చేసే పరిస్థితులు మాత్రం లేవు."- హరీశ్‌రావు, మాజీ మంత్రి
పార్లమెంట్‌లో గళం వినపడాలంటే బీఆర్‌ఎస్ గెలవాల్సిందే : పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఈ మాత్రం కరెంట్ ఇస్తున్నారని, ఎన్నికలు అయిపోతే కరెంట్ కోతలు పూర్తి స్థాయిలో ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని(PM Modi) బడే భాయ్ అని, ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలన్న రేవంత్, దిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని చెప్పకనే చెప్పారని ఆరోపించారు. దిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదన్న హరీశ్‌రావు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోతే పోయేదేమీ లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.
దేశంలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేదని అన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్ పోరాటంతోనే సాధ్యమన్న ఆయన, మన వేలితో మన కన్ను పొడుచుకోవద్దని, తప్పిపోయి మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని సూచించారు. బాండ్ పేపర్(Bond Paper) ఇచ్చి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడితేనే, ఆ పార్టీ హామీలు అమలవుతాయని అన్నారు. రైతులను సంఘటితం చేయాలని, కాంగ్రెస్ మోసాలు వివరించాలని హరీశ్‌రావు తెలిపారు.
'గోల్మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణతో పోలికా?' - రేవంత్‌పై బీఆర్ఎస్ విమర్శలు