Harish Rao Fires on CM Revanth Reddy : కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ, మడమ తిప్పిందని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ(2 Lakh Loan Waiver) చేశారా అని మాజీమంత్రి ప్రశ్నించారు. మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
రుణమాఫీ డబ్బులు రాలేదని, బ్యాంకు అధికారులు రైతుల ఇళ్లపై పడ్డారని వ్యాఖ్యానించారు. రూ. 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలని, రుణమాఫీ కాకపోతే గులాబీ పార్టీకి ఓటు వేయండని ప్రజలకు సూచించారు. వరి పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామన్నారు, మరి ఇచ్చారా అని ప్రశ్నించిన హరీశ్‌రావు, వడ్లపై దృష్టిపెట్టమంటే, రేవంత్‌రెడ్డి వలసలపై దృష్టి పెట్టారని విమర్శించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న మాట ఏమైందని నిలదీసిన మాజీమంత్రి, నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో(Congress Governance) నానా తిప్పలు పెట్టిందని ఆక్షేపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధిచెప్పాలని హరీశ్‌రావు ప్రజలను కోరారు.
"ఈ కాంగ్రెస్ వాళ్ల మ్యానిఫెస్టో ఎవరూ నమ్మేటట్టు లేరని, చివరకు బాండ్ పేపర్‌మీద రాసిచ్చారు. అలానే నోటరీ డాక్యుమెంట్ కూడా జత చేశారు. అయినప్పటికీ ప్రజలు సగం సగం నమ్మితే దిల్లీ నుంచి ఏఐసీసీతో చెప్పించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట కాదు. మా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మాట అని చెప్పుకొచ్చారు. ఇంకా ఒకడగు ముందుకు వేసి ఏమన్నారంటే మొదట అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు. ఇవన్నీ నమ్మి ప్రజలు ఓటేస్తే నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ పార్టీ." -హరీశ్‌రావు, మాజీమంత్రి
BRS Leader Harish Rao Comments on BJP : పదేళ్ల బీజేపీ పాలనలో మన రాష్ట్రానికి చేసిందేమీ లేదని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దేశంలో రూ.60 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం కొండెక్కాయన్న ఆయన, రూ.350 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను వెయ్యి రూపాయలు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని విమర్శించారు. కాషాయ గవర్నమెంట్(BJP Govt) ఏర్పాటుతో రూపాయి విలువ పడిపోవటమే కాక, పేదరికం, నిరుద్యోగం, ఆకలి ఇలా ఒకదానికొకటి పెరిగాయని ఆరోపించారు. రైతులకు నల్లచట్టాలు తెచ్చి, ఏడు వందల మందిని పొట్టనపెట్టుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీదని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరి అటువంటి పార్టీకి ఎందుకు ఓటేయాలని హరీశ్‌రావు ప్రశ్నించారు.