Gujarat CM Bhupendra Patel Election Campaign : దేశంలో మోదీ గాలి వీస్తుందని ఈసారి 400 సీట్లకు పైగా సాధించి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో ఆ నియోజకవర్గ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
దేశంలో ఆధారం లేని వారికి ఆధారం, గ్యారెంటీ నరేంద్ర మోదీ అని, అవినీతి అక్రమాలను అరికట్టడం, ధరల నియంత్రణ, దేశ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించి దేశాన్ని అగ్రగామిగా నిలిపారని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకువచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గొప్ప నాయకుడని అభివర్ణించారు. దేశ వికాసానికి బీజేపీ ఒక్కటే ప్రామాణికమని దానికి ప్రధానిగా మోదీ మాత్రమే అర్హుడని భూపేంద్ర పటేల్ అన్నారు.
"నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారు. దేశ వికాసానికి బీజేపీ ఒక్కటే ప్రామాణికం. దానికి ప్రధానిగా మోదీ మాత్రమే అర్హుడు. భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత ఆయనకే దక్కింది. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి. 400 సీట్లలో విజయాన్ని అందించాలి." - భూపేంద్ర పటేల్, గుజరాత్ సీఎం
Gujarat CM Bhupendra Patel Comments : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత రావడానికి పదేళ్ల సమయం పడితే అదే కాంగ్రెస్ పార్టీకి కేవలం వంద రోజులలోనే వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోయిందన్నారు. జూన్ రెండో వారంలో మూడోసారి మోదీని ప్రధానినగా చూడాలంటే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నుంచి భరత్ ప్రసాద్‌ను ఎంపీగా గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్‌ను మెజార్టీతో గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని కోరారు. ఆగష్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఈసారి 15 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ - BJP LEADER BANDI SANJAY NOMINATION