Gudur MLA Varaprasad Joined in BJP: ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ పార్టీలోని నేతలు ఏ పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి నెలకొన్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి మరో పార్టీకి మకాం మారుస్తున్నారు. ఇలా ఇప్పటికే సీఎం జగన్ నియంతృత్వ పోకడలతో వైసీపీ అసంతృప్త నేతలు పార్టీని వీడగా తాజాగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పార్టీకి బైబై చెప్పేశారు.
వైసీపీని వీడిన ఆయన ఇవాళ బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ బీజేపీలోకి ఆహ్వానించారు. కాగా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వరప్రసాద్‌కు ఈసారి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్ఠానం నిరాకరించింది. దీంతో వైసీపీని వీడిన ఆయన బీజేపీలో చేరారు. వరప్రసాద్‌కు తిరుపతి లోక్‌సభ టికెట్ ఇస్తామని బీజేపీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం మోదీకే సాధ్యమని ఆయన సారధ్యంలో పని చేయడం సంతోషంగా ఉందని వరప్రసాద్ అన్నారు. మరోసారి తిరుపతి ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఐఎఎస్ అధికారిగా పనిచేసిన వరప్రసాద్ 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తిరుపతి నుంచి మొదటిసారి ఎంపీగా పోటీచేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో తిరుపతి ఎంపీగా గెలిచారు. అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Huge Joinings in TDP From YSRCP: మరోవైపు రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకులు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. బాపట్లజిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో పర్చూరు వైసీపీ నాయకులు ఆకుల మధుబాబు, ఇడిమిశెట్టి పెద్దబ్బాయి, ఇందిరా కాలనీ వాసులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వారిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి అరాచకాలు ఆ పార్టీ నాయకులకే నచ్చక టీడీపీలోకి వరుస కడుతున్నారని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు.
నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. మార్కాపురం మండలం వేములకోటలో వైసీపీను వీడి 100 కుటుంబాలు టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరాయి. వైసీపీకి కంచుకోటైన వేములకోట నుంచి వంద కుటుంబాలు టీడీపీలో చేరటంతో కంచుకోట బద్దలైనట్లయింది. ప్రస్తుతం రాష్ట్ర ఏపీఐఐసీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి స్వగ్రామమైన వేములకోట నుంచి ఇంత మంది తెలుగుదేశంలో చేరటం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీలోకి భారీ చేరికలు- ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద సందడి