Greater Hyderabad Lok Sabha Election Results 2024 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో హైదరాబాద్ మినహా సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులు జి.కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తమ సమీప ప్రత్యర్థులపై సునాయాసంగా గెలిచారు. పాతబస్తీని కంచుకోటగా మార్చుకున్న మజ్లిస్ పార్టీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో తమకు ప్రత్యర్థులెవరూ లేరని, విజయాన్ని ఆపలేరంటూ మరోసారి చాటిచెప్పింది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల స్థానం గెలిచిన బీఆర్ఎస్ ఈసారి గ్రేటర్ పరిధిలో ఒక్కసీటునూ గెలవలేకపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాల్లో విజయానికి గట్టి ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్నీ కోల్పోయి గ్రేటర్ పరిధిలో భంగపాటు ఎదుర్కొంది. కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నికలో గెలవడమే హస్తం పార్టీకి కాస్త ఊరట.
పకడ్బందీ ప్రణాళిక - పక్కా కార్యాచరణ : గ్రేటర్ హైదరాబాద్‌లో పాగా వేస్తే భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావచ్చన్న ఆలోచనతో బీజేపీ అగ్రనాయకులు ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. గత సంవత్సరం జులై నుంచే అగ్రనేతలు నరేంద్రమోదీ, అమిత్‌షా పకడ్బందీగా ప్రణాళికలను రూపొందించారు. ఎన్నికల షెడ్యూలు ప్రారంభంకాగానే మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్‌గోయల్ తదితరులు, కమలం పాలిత రాష్ట్రాల సీఎంలు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వీరికి అదనంగా ఇతర రాష్ట్రాల నాయకులు, శ్రేణులు ఆ పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించారు.
అసదుద్దీన్ ఐదో విజయం : హైదరాబాద్ లోక్‌సభ మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి గెలుపొందారు. తొలి రెండు రౌండ్లలో వెనుకబడినా పన్నెండు రౌండ్లు పూర్తయ్యేసరికి రెండు లక్షలకుపైగా మెజారిటీని సాధించారు.
టీవీలకు అతుక్కుపోయిన నగరవాసులు : పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రభావం హైదరాబాద్ ట్రాఫిక్‌పై స్పష్టంగా కనిపించింది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనో ఉత్కంఠతో నగరవాసులు పూర్తిగా టీవీలకు అతుక్కుపోయారు. దీంతో ప్రధాన రహదారులు, కూడళ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బస్సులు కొన్నిచోట్ల ఖాళీగా దర్శనమిచ్చాయి. ఫలితాల వెల్లడి నేపథ్యంలో రాకపోకల సంఖ్య సగానికి పడిపోయిందని పోలీసులు పేర్కొన్నారు.
పార్టీలు మారినా ఫలితం సున్నా : నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఒక్కటీ అటు అధికార పార్టీకి గానీ, ఇటు ప్రతిపక్షానికి గానీ దక్కలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పట్నం సునీతారెడ్డి మల్కాజిగిరి నుంచి, ఎంపీ రంజిత్‌రెడ్డి చేవెళ్ల నుంచి చేతి గుర్తుపై పోటీ చేశారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం పార్టీలో చేరి సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ భారత్ రాష్ట్ర సమితిలో చేరి చేవెళ్ల ఎంపీగా పోటీ చేశారు. ఎన్నికల సంగ్రామంలో గెలుపు కోసం వీరంతా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.
రికార్డ్ తిరగరాసిన ఈటల రాజేందర్ : హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ 2,82,186 ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేరిట ఉంది. ఆ రికార్డ్‌ను మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ తిరగరాశారు. సమీప హస్తం పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల ఆధిక్యం సాధించారు. మరోవైపు ఐదోసారి హైదరాబాద్ ఎంపీగా విజయం సాధించిన అసదుద్దీన్ ఒవైసీ తాజా ఎన్నికల్లో పాత రికార్డును అధిగమించి 3,38,087 ఓట్ల ఆధిక్యతతో విజేతగా నిలిచారు.
ఎంపీ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇలా :
- సికింద్రాబాద్‌లో మొత్తం 8,989 ఓట్లలో బీజేపీకి 4,701, కాంగ్రెస్‌కు 2,848, బీఆర్ఎస్‌కు 906, నోటాకు 74 ఓట్లు పడ్డాయి. 280 రిజెక్ట్ అయ్యాయి.
- హైదరాబాద్‌లో మొత్తం 6,917లో బీజేపీకి 3,413, ఎంఐఎంకు 2,703, కాంగ్రెస్‌కు 465, బీఆర్ఎస్‌కు 143, నోటాకు 39 పోలవగా, 137 తిరస్కరించబడ్డాయి.
- మల్కాజిగిరిలో మొత్తం 18,880లో బీజేపీకి 10,330, కాంగ్రెస్‌కు 6,230, బీఆర్ఎస్‌కు 1,789, నోటాకు 160 ఓట్లు నమోదయ్యాయి. 222 తిరస్కరణకు గురయ్యాయి.
- చేవెళ్లలో మొత్తం 19,397లో బీజేపీకి 11,365, కాంగ్రెస్‌కు 6,124, బీఆర్ఎస్‌కు 1,428, నోటాకు 110 ఓట్లు పడ్డాయి. 221 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014, 2019లో జరిగిన రెండు పార్లమెంట్ ఎన్నికలను పరిశీలిస్తే హైదరాబాద్‌లోని నాలుగు స్థానాల్లో మూడు మినహా మల్కాజిగిరి ఎంపీ స్థానం మాత్రం ప్రతిసారీ విభిన్నంగా తీర్పు చెప్పింది. హైదరాబాద్ ఎంపీ సీటును వరుసగా రెండుసార్లు ఎంఐఎం దక్కించుక్కుంది. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక చేవెళ్ల ఆవిర్భవించాక ఆ స్థానం నుంచి రెండుసార్లు కారు జోరు కొనసాగింది. మల్కాజిగిరి నుంచి 2014లో టీడీపీ, 2019లో కాంగ్రెస్ గెలుపొందాయి.