Venkaiah Naidu Comments on Politics: ప్రజా జీవితంలో సిద్ధాంతాలు, విలువలు, సంప్రదాయాలను గౌరవించాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రజాప్రతినిధులకు ఉద్భోదించారు. పోలీసు స్టేషన్లపై, రెవెన్యూ కార్యాలయంపై పెత్తనం కాకుండా అభివృద్ధిపై నేతలు దృష్టి ఉండాలని హితవు పలికారు. విజయవాడ శివారు నిడమానూరులో వెంకయ్యనాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకుని 50 ఏళ్ల ప్రజాజీవనంలో అలుపెరగని ప్రయాణం సాగిస్తున్నందుకు అభినందిస్తూ ఆత్మీయ సంగమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మిత్రులు, బంధువులు, అధికారులను వెంకయ్యనాయుడు ఆత్మీయంగా పలకరించారు. వారంతా సముచితంగా సత్కరించారు.
అదొక్కటే తీరని వెలితి: ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తన బాల్యం, విద్య, రాజకీయ ప్రవేశం, ఉన్నత పదవులు, ఇతర జీవిత విశేషాలు, అనుభవాలను తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. చిన్నతనం నుంచి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలచుకుంటూ ముందడుగు వేశానని చెప్పారు. చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడం ఒక్కటే తనకు తీరని వెలితి తప్ప ఇంతవరకు ఎందులోనూ తనకు అసంతృప్తి లేదన్నారు. న్యాయవాది కావాలనే తన తల్లి ఆలోచనకు అనుణంగా లా చదివినా, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జన్సీ కారణంగా జైలుకు వెళ్లి న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేయలేకపోయానని చెప్పారు.
పాలకులు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తే సరిపోతుంది : వెంకయ్యనాయుడు - Venkaiah Naidu on Free Schemes
ఓడించినా వారికి ధన్యవాదాలు: విద్యార్ధి నాయకుడిగా తనకు ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినా, తొలి ఎన్నికల్లో ఓటమి కారణంగా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి రెండుసార్లు వరుసగా గెలిపించిన అక్కడి ప్రజలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఆ తర్వాత నియోజకవర్గం మారి ఆత్మకూరు వెళ్లినా అక్కడి ప్రజలు తనను ఓడించిన కారణంగానే రాష్ట్రస్థాయి నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సి రావడం వల్ల అక్కడి ప్రజలకు తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. కబడ్డీపై ఉండే ఆసక్తి కారణంగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరానని, అక్కడే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలనే ఆలోచన, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, సమాజ చింతన అలవడ్డాయని అన్నారు.
మార్పులను తప్పుపట్టడం సరికాదు: యువత తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలని, ప్రభుత్వాలు మాతృభాషలోనే పిల్లలు చదివే అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయస్థాయిలో రాణించాలంటే హిందీ భాష అభ్యాసన తప్పనిసరి అని చెప్పారు. చరిత్రను, పూర్వీకుల గొప్పతనాలను నేటితరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, చరిత్ర పాఠ్యాంశాల్లో చేస్తున్న మార్పులను తప్పుపట్టడం సరికాదని వారించారు. ప్రజాజీవితంలో తన మొదటి అడగులు పడింది విజయవాడలోనేనని చెప్పారు. స్వరాజ్య మైదానంతోనే తనకు ఎంతో అనుబంధం ఉందని, ఇప్పుడు స్వరాజ్యం వచ్చింది కాబట్టి మైదానం తీసేసినట్టు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
ఆలోచనల్లో మార్పులు రావాలి: నేటితరం ప్రజాప్రతినిధుల ఆలోచనల్లో మార్పులు రావాలని, చట్టసభల్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఉపయోగించాలని సూచించారు. రాజ్యసభ ఛైర్మన్‌ను సైతం ధిక్కరించి కొందరి సభ్యుల ప్రవర్తనపై సునిశితంగా స్పందించారు. సంప్రదాయాలు, ఉత్తమ సంస్కారం అనివార్యమన్నారు. రాష్ట్రంలోనూ ఆ పద్ధతి పాటించకుండా బూతులు మాట్లాడిన వారికి ఇటీవలి ఎన్నికల్లో తగిన గుణపాఠం ఎదురైందన్నారు. పార్టీలు వేరైనా అంతా ప్రత్యర్ధులమే తప్ప శత్రువులు కాదనే భావన ఉండాలన్నారు.
చట్టప్రకారం పనిచేయాలి: ప్రభుత్వ అధికారులు సైతం చట్టప్రకారం పనిచేయాలని, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని సూచించారు. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం, చైతన్యం వస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు కొలుసు పార్ధసారధి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోడే ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకటరావు, మండలి బుద్దప్రసాద్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రఘురామ కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.