Former Minister Prathipati Pullarao Son Sharath Released from Jail: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలు వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. శరత్‌కు దిష్టి తీసిన తెలుగు మహిళలు సాదరస్వాగతం పలికారు.
పన్ను ఎగవేత కేసు - ప్రత్తిపాటి శరత్ పోలీస్ కస్టడీకి హైకోర్టు నిరాకరణ
కుమారుడిని చూసి చలించిపోయిన పుల్లారావు కొంత ఉద్వేగానికి లోనయ్యారు. కుమారుడిని చూసిన ఆనందంలో గట్టిగా కౌగిలించుకున్నారు. న్యాయం గెలిచిందంటూ తెలుగుదేశం నాయకులతో పాటు పుల్లారావు వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన శరత్‌ను తెలుగుదేశం అభిమానులు భుజాలపై ఎత్తుకొని కొద్దిదూరం ర్యాలీ చేశారు. అనంతరం దారి పొడవునా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ చిలకలూరిపేట బయలుదేరారు.
గుంటూరు శివారు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్రవాహనం, కార్ల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. కార్యకర్తల ఆనందోత్సాహాలు, కేరింతల నడుమ స్వాగత ర్యాలీ ఘనంగా సాగింది. బోయపాలెంలో పార్వతీదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం యడ్లపాడు, తిమ్మాపురం, గణపవరం మీదగా చిలకలూరిపేట పట్టణం వరకు పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు దారి పొడవున బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. జన నీరాజనాల మధ్య గురువారం అర్ధరాత్రి చిలకలూరిపేటలోని నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం అభిమానులతో కోలాహలం నెలకొంది.
శరత్ అరెస్టు అక్రమం - ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య: టీడీపీ
HC on Prathipati Sarath Police Custody Petition: కాగా తెలుగుదేశం నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కస్టడీ అభ్యర్థనను విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సీఐడీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సమర్థిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.
జీఎస్టీ(GST) ఎగవేత, బోగస్ ఇన్వాయిస్‌లతో నిధుల్ని మళ్లించారనే ఆరోరణలతో శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో శరత్‌ను విచారణ కోసం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఒకటో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును కోరగా సీఐడీ అభ్యర్థను న్యాయస్థానం తిరస్కరించింది.